logo

వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

ఓ వ్యక్తి వేధింపులు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి.. తమ ఇంటికే వచ్చి భార్యను వేధిస్తున్న వ్యక్తిని చూసి భర్త తట్టుకోలేకపోయాడు.. అవమానంగా భావించిన ఆ జంట మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేయడంతో భార్య మృతి చెందగా, భర్త చికిత్స పొందుతున్నాడు.

Published : 01 Jul 2024 02:41 IST

భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

నీలమ్మ  (పాతచిత్రం)

నెల్లికుదురు, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి వేధింపులు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి.. తమ ఇంటికే వచ్చి భార్యను వేధిస్తున్న వ్యక్తిని చూసి భర్త తట్టుకోలేకపోయాడు.. అవమానంగా భావించిన ఆ జంట మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేయడంతో భార్య మృతి చెందగా, భర్త చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలంలోని పెద్దతండా(ఎంఆర్‌పీ)లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై కె.క్రాంతికిరణ్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బానోత్‌ భద్రు, బానోత్‌ నీలమ్మ(36)కు పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన బానోత్‌ వీరన్న కొన్నాళ్లుగా నీలమ్మతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించారు. వీరన్న ఆ కుటుంబం జోలికి వెళ్లొద్దని తీర్మానించారు. అయినప్పటికి వీరన్న ఆగడాలు ఆగలేదు. శనివారం నీలమ్మ ఇంటికి వెళ్లి ఆమెను వేధించాడు. ఈ సంఘటనను చూసిన భద్రు అవమానాన్ని భరించలేక ఆదివారం పురుగు మందు తాగగా, విషయం తెలిసి భార్య కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఇరుగుపొరుగువారు గమనించి తొర్రూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నీలమ్మ మృతి చెందారు. భద్రు చికిత్స పొందుతున్నారు. మృతురాలి సోదరుడు బాదావత్‌ కిషన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికిరణ్‌ వివరించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని