logo

మీ మాట.. గుర్తు చేసుకుందాం!

రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు.

Updated : 29 Jun 2024 06:07 IST

ఓరుగల్లు ప్రగతిపై గతంలో ముఖ్యమంత్రి హామీలు.. అమలుపై ఆశలు
ఈనాడు, వరంగల్, ఈనాడు, డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి

రాష్ట్రంలో రాజధాని తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కీలక పరిశ్రమలు, అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో వివిధ సందర్భాల్లో 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. గతేడాది ప్రతిపక్షంలో ఉండి పాదయాత్రను ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మల చెంతనే మొదలుపెట్టారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం,  సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై పలు హామీలు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిపై సమీక్షించేందుకు శనివారం ఓరుగల్లు పర్యటనకు వస్తున్నారు. మెగా జౌళి పార్కు సందర్శనతోపాటు, నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. గతంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఏ హామీ ఇచ్చారో ఓసారి గుర్తుచేస్తూ ప్రత్యేక కథనం.

తేదీ: 07.05.24
సందర్భం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం
స్థలం: హనుమకొండ చౌరస్తా వద్ద కూడలి సమావేశంలో
ముఖ్యమంత్రి ఏమన్నారు: ఓరుగల్లు నగరానికి భూగర్భ డ్రైనేజీ వేస్తాం. పాత డీపీఆర్‌ను అధికారులు రివైజ్‌ చేసి తీసుకురావాలి. మాస్టర్‌ ప్లాన్‌తోపాటు, వరంగల్‌కు భూగర్భ డ్రైనేజీ చేపట్టేందుకు ఎన్నికలు అయిన వెంటనే అధికారులు, మంత్రులు నా వద్దకు పూర్తి సమాచారంతో రావాలి.  రెండో రాజధాని అయిన వరంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.
ఏం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి  నగరాభివృద్ధిపై నిర్వహించే సమీక్షలో భూగర్భ మురుగునీటి పారుదల, బృహత్‌ ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.   28 ఏళ్లుగా భూగర్బ మురుగునీటి పారుదల కల నెరవేరడం లేదు. డీపీఆర్‌ను వెంటనే రూపొందించి, తగినన్ని నిధుల్ని విడుదల చేసి పూర్తి చేస్తే నగరం వరదల గుప్పిట చిక్కుకోకుండా, పరిశుభ్రంగా ఉంటుంది. మరోవైపు ‘కుడా’ ఆధ్వర్యంలో విజన్‌-2050 పేరుతో 2017-18లో వరంగల్‌ నూతన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ఇది అమలు కాకుండా కొందరు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. 

వరంగల్‌ హైదరాబాద్‌ జాతీయ రహదారి (దీనిపై పారిశ్రామిక నడవా ఏర్పాటుచేయాల్సి ఉంది)

24.04.24
లోక్‌సభ ఎన్నికల ప్రచారం
మడికొండలో బహిరంగ సభ
హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావశాలు కల్పించి తీరుతాం. అజంజాహి మిల్లు ఒకప్పుడు కళకళలాడేది. అది పోయాక పద్మశాలి సోదరులకు ఉపాధి కరవైంది. దాని స్థానంలో వరంగల్‌లో జౌళి పార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం.
రాజధాని నుంచి ఓరుగల్లు వరకు పారిశ్రామిక నడవా ప్రతిపాదన గతం నుంచే ఉంది. దీనిపై ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమై తగిన భూసేకరణ చేపట్టి నడవా ఏర్పాటుచేయాలి. వరంగల్‌ జౌళి పార్కులో 2017 నుంచి పనులు జరుగుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మిత్ర’ కింద ఎంపిక చేసినా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు కాకపోవడంతో కేంద్రం నిధులు రావడం లేదు. వెంటనే జౌళి పార్కు కోసం ప్రత్యేక ప్రయోజన వాహకం ఏర్పాటు చేయాలి.


మహా నగరం.. మీ రాక కోసం

కార్పొరేషన్‌ (వరంగల్‌)

వరంగల్‌లో ఓపెన్‌ డ్రైనేజీ

వరంగల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపిస్తారని నగరవాసులు ఆశిస్తున్నారు.  రాబోయే అయిదేళ్లలో  నగరానికి ఏం కావాలి, అత్యవసరం, దీర్ఘకాలిక  అభివృద్ధి పనులపై ఇప్పటికే బల్దియా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. వాటిని సాకారం చేయాలని కోరుతున్నారు. ఆ వివరాలు..

వరద ముంపు

చిన్నపాటి వర్షానికే నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు నీట మునుగుతున్నాయి.  ఏటా 150 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.  నగరంలో 29 ప్రధాన నాలాలున్నాయి. వీటిని ఆధునికీకరించాలి. హంటర్‌రోడ్‌ బొందివాగు, 12 మోరీలు- భద్రకాళి, నయీంనగర్, కాజీపేట బంధం చెరువు నాలాలను వరదనీటి కాలువలుగా అభివృద్ధి చేయాలి. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.250 కోట్లతో పనులు మొదలు కానున్నాయి. మరో విడతలో రూ.487 కోట్ల నిధులు అవసరం.

సీఎం హామీల పథకం

గత ప్రభుత్వ హయాంలో వరంగల్‌ నగరానికి ముఖ్యమంత్రి హామీల పథకం ద్వారా రూ.900 కోట్లు కేటాయించారు. ఇందులో  రూ.250 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.450 కోట్లతో నగరంలోని 66 డివిజన్లలో కీలకమైన అభివృద్ధి పనులు ప్రతిపాదించారు. కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి, కొత్త పనులు చేపట్టేందుకు  పెండింగ్‌ నిధులు విడుదల చేయాలి.

ఇటీవల నీటమునిగిన కాశీబుగ్గ రోడ్డు

స్మార్ట్‌సిటీ పనులు ఆలస్యం

స్మార్ట్‌సిటీ పథకం అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి ఆగుతూ.. సాగుతున్నాయి.  రూ.943 కోట్లతో 32 పనులు ప్రతిపాదించగా, 15 పూర్తయ్యాయి. మిగిలినవి కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్‌ నిధులు విడుదల చేయాల్సి ఉంది. 

 

‘పట్టణ ప్రగతి’కి నిధులు..

పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రేటర్‌ వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.7.32 కోట్లు విడుదల చేసింది. రెండేళ్లుగా పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. పూర్తయినవి, టెండర్లు పిలిచిన పనులు చేపట్టేందుకు పెండింగ్‌లో ఉన్న రూ.58 కోట్లు విడుదల చేయాలి.

సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో మూడుచోట్ల సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాల కోసం గత ప్రభుత్వం జీఓ నెంబరు 65 ద్వారా రూ.32 కోట్లు కేటాయించింది. నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని సత్వరమే విడుదల చేయాలి.

పోతనరోడ్‌లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులు

అంతర్‌ వలయ రహదారి

వరంగల్‌ నగరానికి బైపాస్‌ రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1972 వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన 200 అడుగులు అంతర్‌ వలయ రహదారి(ఇన్నర్‌ రింగురోడ్డు) పనులు కాకతీయ పట్టణాభివృద్ధి ప్రారంభించింది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్‌ పంపు సెంటర్‌ నుంచి జానీపీరీలు, కీర్తినగర్‌ మీదుగా ఎనుమాముల వరకు తొలివిడతలో 8 కిలో మీటర్లు పనులు మొదలయ్యాయి. 70 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు, భూసేకరణ కోసం 140 కోట్లు కావాలి. రెండో విడత ఎనుమాముల- ఆరెపల్లి వరకు 6 కిలో మీటర్ల పనులు చేసేందుకు రూ.300 కోట్లు అవసరం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వాలని ‘కుడా’ నివేదిక సిద్ధం చేసింది.

ఎంజీఎంలో సేవలు మెరుగుపరచాలి

ఉత్తర తెలంగాణలో వైద్యానికి పెద్ద దిక్కయిన వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టిసారించాలి. ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలైన ఏఎంసీ, ఆర్‌ఐసీయూల్లో పడకలు తక్కువగా ఉన్నందున వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. క్యాజువాలిటీ ఇరుగ్గా ఉండడంతోపాటు, అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. ఆసుపత్రిలో రసాయనాలు సరిపడా లేక పలు కీలక రోగ నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు.

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు కుంటుపడుతున్నాయి. ఏసీలు పనిచేయక గత కొన్ని నెలల నుంచి శస్త్రచికిత్సలు జరగడం లేదు. ప్రభుత్వం నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పటికిప్పుడు ప్రారంభించే అవకాశం లేనందున ఎంజీఎంలో సేవలను మెరుగుపరచాల్సి ఉంది.


కాళోజీ కళాక్షేత్రం: దివంగత ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో హనుమకొండ బాలసముద్రం హయాగ్రీవాచారి మైదానంలో కళాక్షేత్రం పనులు ప్రారంభించారు. మూడు, నాలుగేళ్లవుతున్నా పూర్తికావడం లేదు. నిధుల కొరత ఉంది. ఇప్పటికే ‘కుడా’ నుంచి రూ.40 కోట్లు ఖర్చయ్యాయి. అదనపు పనుల కోసం మరో రూ.40 కోట్ల నిధులు విడుదల చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని