logo

క్రీడాభివృద్ధికి ఓరుగల్లు అనుకూలం

క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్‌ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్‌ పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 05:05 IST

ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్‌ని సత్కరించిన వరంగల్, హనుమకొండ జిల్లాల క్రీడల అధికారులు, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: క్రీడాభివృద్ధికి నగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఓరుగల్లు స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ స్పోర్ట్స్‌ సిటీగా మారుతుందని రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణిప్రసాద్‌ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియాన్ని ఆమె సందర్శించారు. సింథటిక్‌ ట్రాక్‌ పరిశీలించారు. స్టేడియంలో జరగుతున్న పలు అభివృద్ధి పనులను హనుమకొండ జిల్లా క్రీడల అధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్రీడా పాఠశాలల ప్రవేశాలకు జరుగుతున్న ఎంపిక పోటీల ప్రక్రియను పరిశీలించి బాలుర 800 మీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు పలు క్రీడా సంబంధిత సమస్యలపై వినతిపత్రం అందించారు. పర్యాటకశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, యువజనశాఖ నైపుణ్య అభివృద్ధి కేంద్రం అధికారి మహ్మద్‌ నయీం, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు కైలాస్‌యాదవ్, శ్యాంప్రసాద్, సృజన్‌కాంత్, కోచ్‌లు శ్రీమాన్, శంకర్, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ(ఎస్‌ఏటీజీ)లో పనిచేస్తున్న కోచ్‌ సమస్యలను పరిష్కరించాలని వరంగల్‌ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి టీవీఎల్‌ సత్యవాణి కోరారు. శుక్రవారం జేఎన్‌ఎస్‌కు వచ్చిన రాష్ట్ర క్రీడలు, యువజన, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని