logo

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..

సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు.

Published : 29 Jun 2024 04:58 IST

మాట్లాడుతున్న సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య

భూపాలపల్లి, న్యూస్‌టుడే : సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ, కార్మికులను చైతన్య పరుస్తున్నట్లు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గని ఆవరణలో ద్వార సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా 60 బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారని, ఇందులో సింగరేణిలో ఒక బొగ్గు బ్లాక్‌ ఉందని, ఈ బ్లాక్‌ వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్‌ హమ్మద్‌ మాట్లాడుతూ.. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు పూర్తిగా విఫలమయ్యాయని, గతంలో భారాస నాయకులు చేసిన పాపాలకు వ్యతిరేకంగా నేడు విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సింగరేణి కార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరేళ్ల క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌ తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేటీకరణ చేసి, ఇప్పుడు మోసపూరితమైన మాటలతో కార్మికవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల బ్లాక్‌-2లో సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాదని ఓ తప్పుడు నివేదిక సృష్టించి, ప్రైవేటీకరణకు భారాస ప్రభుత్వం సహకరించిందని విమర్శించారు. సమావేశంలో ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ నాయకులు పోషమల్లయ్య, నారాయణ, నీరటి రాజన్న, శంకరయ్య, వెంకన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని