logo

వ్యాపారుల మాయాజాలం

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్‌ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్‌ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు.

Published : 29 Jun 2024 04:52 IST

కేసముద్రం మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఖరీదు
కేసముద్రం, న్యూస్‌టుడే

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనామ్‌ విధానాన్ని అమలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం అందుకుంది. అలాంటిది కొంత మంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్‌ బయట ఖరీదులు నిర్వహిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని తరుగు, తేమ పేరుతో నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

చేయాల్సింది ఇలా..

సరకు విక్రయించేందుకు వచ్చిన రైతులకు మార్కెట్‌ కమిటీ అండగా నిలిచి గిట్టుబాటు ధర కల్పించాలి. తూకంలో మోసం లేకుండా జాగ్రత్తలు తీసుకొని విక్రయ సొమ్ము సకాలంలో చెల్లించేలా చూడాలి. దీనికోసం మార్కెట్‌ యార్డులో అధికారులతోపాటు తూకం వేయడానికి దడువాయిలు, కార్మికులు, సూపర్‌వైజర్లు ఉంటారు. సరకుల విక్రయం తర్వాత రైతు మార్కెట్‌ కార్యాలయంలో తక్‌పట్టీ తీసుకొని వ్యాపారి వద్దకు వెళ్తారు. ఇలా మార్కెట్‌ యార్డులో సరకులు అమ్ముకోవడం వల్ల రైతుకు ఎక్కడ మోసం జరిగినా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

జరుగుతుంది ఇలా.. 

కొంతమంది వ్యాపారులు మార్కెట్‌ బయట ప్రధాన రహదారుల వెంట తమ గుమస్తాలను తేమ పరీక్షించే యంత్రాలు చేత పట్టుకొని నిలబెడుతున్నారు. సరకుతో వస్తున్న వాహనాలను అడ్డుకొని ఎక్కువ ధర చెల్లిస్తామని ఆశ చూపి తమ మిల్లు, ట్రేడింగ్‌ సంస్థ వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత తేమ, నాప గింజల పేరిట తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీనికి తోడు ప్రతి ట్రాక్టరుకు 30 కిలోల చొప్పున  తరుగు తీస్తున్నారు. మార్కెట్‌ నిబంధనల మేరకు ఖరీదు చేసిన సరకు విక్రయ సొమ్ము అదేరోజు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు 15 రోజుల వాయిదా పెడుతున్నారు. వెంటనే నగదు చెల్లించాలని కోరితే సొమ్ములో ఒక శాతం కోత విధిస్తున్నారు. వాయిదాలో ఖరీదు చేసిన వ్యాపారి బోర్డు తిప్పితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. వేబ్రిడ్జిపై తూకం వేస్తున్నప్పటికీ కార్మికుల ఖర్చు పేరిట బస్తాకు రూ.20 కోత పెడుతున్నారు. ఆ డబ్బులు కార్మికులకు ఇవ్వకుండా వ్యాపారులే కాజేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతు, కార్మిక నాయకులు కోరుతున్నారు.

మార్కెట్‌ బయట వేబ్రిడ్జిపై తూకమేస్తున్న రైతు


తరుగు పేరిట దోచుకుంటున్నారు

- గంట రామ్మోహన్‌రెడ్డి, కల్వల, రైతు

మార్కెట్‌ యార్డు సరకులతో నిండిపోవడంతో బయట వ్యాపారులకు విక్రయించాను. ట్రాక్టరుకు 30 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. నగదు డబ్బులు ఇవ్వమంటే ఒక శాతం కోత పెడుతున్నారు. లేదంటే 15 రోజులు వాయిదా పెడుతున్నారు. దీంతో మార్కెట్‌లో 25 శాతం రైతులు మాత్రమే విక్రయిస్తున్నారు. 75శాతం రైతులు మార్కెట్‌ బయట విక్రయిస్తున్నారు.


నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

- మల్లేశం, సంయుక్త సంచాలకుడు, మార్కెటింగ్‌ శాఖ

క్షేత్రస్థాయిలో సందర్శించి మార్కెట్‌ అధికారులతో సమావేశం నిర్వహించి మార్కెట్‌ ఫీజు చెల్లింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం.  రైతులు  మార్కెట్‌ యార్డులోనే అమ్ముకోవాలి. నిబంధనల ప్రకారం ఏరోజు ఖరీదు చేసిన సరకులకు అదే రోజు చెక్‌ ఇవ్వాల్సి ఉంటుంది.   విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని