logo

బ్యాంకు లింకేజీలో ఆదర్శం గీసుకొండ

జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Published : 29 Jun 2024 04:45 IST

గీసుకొండ మండల సమాఖ్య పరిధిలోని కొమ్మాలలో తయారుచేసిన అల్లం పేస్టులతో కోమల..
రుణం పొంది వీటిని తయారుచేసి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందారు..

పరకాల, గీసుకొండ, న్యూస్‌టుడే: జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలను అందుకుని మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలిచిన గీసుకొండ మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య (ఎంఎస్‌) స్వయం సహాయక సంఘం మహిళలకు లక్ష్యాన్ని మించి రుణాలను అందించింది. బ్యాంకు లింకేజీ రూ.30 కోట్ల రుణాల లక్ష్యంతో రూ.53 కోట్ల రుణాలను (160 శాతం) మహిళా సంఘాలకు అందించింది. మరోవైపు గతంలో తీసుకున్న రుణాలను 99 శాతం రికవరీ చేసింది. దీంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం.. అవార్డుతో పాటు ప్రశంసా పత్రంతో సత్కరించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సెర్ప్‌ ఏపీఎం సురేష్‌కుమార్, ఎంఎస్‌ అధ్యక్షురాలు కవిత.. మంత్రి సీతక్క, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌సుల్తానియా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

జీవనోపాధికి కృషి..

గీసుకొండ మండల సమాఖ్య పరిధిలో 845 స్వయం సహాయక సంఘాలు, 36 గ్రామైక్య సంఘాలున్నాయి.  ఇందులోని 680 సంఘాల్లో ఒక్కోదానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున ఆరు బ్యాంకుల నుంచి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అందించింది. ఇలా ఉమ్మడి వరంగల్‌లోనే గీసుకొండ మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. రుణం అందుకున్న మహిళలు జీవనోపాధికి బాటలు వేసుకున్నారు. సంఘంలోని మహిళలు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్‌) క్యాష్‌ క్రేడిట్‌లోన్‌ (సీసీఎల్‌) రుణాలను తీసుకొని ఆర్థికంగా బలోపేతమవుతూ లక్షాధికారులు అవుతున్నారు.

లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించిన సెర్ప్‌ ఏపీఎం సురేష్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి అవార్డును అందజేస్తున్న మంత్రి సీతక్క


బ్యాంకర్లు, సెర్ప్‌ సిబ్బందితోనే ప్రథమ స్థానం

- సెర్ప్‌ ఏపీఎం సురేష్‌కుమార్‌

జీవనోపాధికి మహిళలకు రుణాలను అందించడంలో సెర్ప్‌ సీసీలు, సిబ్బందితో పాటు బ్యాంకు మేనేజర్ల కృషి ఎంతో ఉంది. సంఘాల్లోని మహిళలు తీసుకున్న రుణాలను తిరిగి సక్రమంగా చెల్లిస్తుండడంతో మండల సమాఖ్యకు రాష్ట్రస్థాయిలో మంచి పేరు వచ్చింది. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని