logo

మట్టిలో పుట్టిన సీత శిశుగృహకు అప్పగింత

‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే.

Published : 29 Jun 2024 04:42 IST

బాధ్యులకు శిశువును అప్పగిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్‌

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ‘మట్టిలో పుట్టిన సీత’ శిశువు గృహకు చేరింది. మే 4వ తేదీన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మట్టిలో పాతిపెట్టగా, ఓ లారీ చోదకుడు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. ప్రాథమిక చికిత్స అనంతరం ఆ బిడ్డను ఎంజీఎం ఆసుపత్రి నవజాతశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై ఈనాడులో ‘ఈ పసిబిడ్డ మట్టిలో పుట్టిన సీత’ శీర్షికతో మానవీయ కోణంలో ప్రచురితమైన కథనం అందరినీ కదిలించింది. జిల్లా అధికారులు స్పందించి శిశువుకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం వైద్యాధికారులను ఆదేశించారు. బరువు తక్కువగా ఉన్న శిశువుకు 50 రోజులుగా ఎంజీఎం నవజాత శిశు సంరక్షణ కేంద్రం పిల్లల వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో పునరావాసం కోసం శిశుగృహకు అప్పగించడానికి వైద్యులు నిర్ణయించారు. శుక్రవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ బాధ్యులు ఎంజీఎం ఆసుపత్రికి రాగా, సూపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్, పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ సుధాకర్‌ శిశువును వారికి అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లాసంక్షేమ అధికారి కె.మధురిమ మాట్లాడుతూ.. ఆడపిల్లలు వద్దు అనుకునేవారు నేరుగా సంప్రదించి శిశుగృహకు అప్పగించినట్లయితే వారిని చట్టబద్ధమైన దత్తతకు అప్పగిస్తామన్నారు. ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ అన్నమనేని అనిల్‌చందర్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర దత్తత వనరుల విభాగం నిబంధనల ప్రకారం నవజాత శిశువు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌ఛార్జి అధికారి ఎస్‌.ప్రవీణ్‌కుమార్, శిశుగృహ మేనేజరు నగేష్, శిశుగృహ సోషల్‌ వర్కర్‌ సంగి చైతన్య, ఔట్రీచ్‌ వర్కర్‌ పి.విజయ్‌కుమార్, ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్‌ కె.రజిత తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని