logo

మొలకెత్తని విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన

మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు.

Published : 29 Jun 2024 04:40 IST

చరవాణిలో కలెక్టర్‌తో మాట్లాడుతున్న మాజీ మంత్రి దయాకర్‌రావు

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: మొలకెత్తని విత్తనాలు విక్రయించారంటూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం ఎదుట రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు. రాయపర్తి మండలం తిర్మాలాయపల్లి గ్రామానికి చెందిన రైతులు ఈ నెల 24న వర్ధన్నపేటలోని జ్ఞానాంభిక విత్తనాలు, ఎరువుల దుకాణంలో సుమాంజలి సీడ్స్‌ వారి కేఎన్‌ఎం-1638 వరి విత్తనాలు కొనుగోలు చేశారు. విత్తనం సక్రమంగా మొలకెత్తడం లేదని శుక్రవారం దుకాణానికి వచ్చి నిలదీశారు. అదే సమయంలో సమీపంలోని పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి దయాకర్‌రావు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చారు. రైతుల సమస్య తెలుసుకొని చరవాణిలో జిల్లా కలెక్టర్, వ్యవసాయాధికారులతో మాట్లాడారు. ఈ విషయంలో చర్యలు తీసుకొని అవసరమైతే కేసులు నమోదు చేయాలని కోరారు. స్పందించిన జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాల్, ఏడీఏ సురేశ్‌కుమార్‌ వర్ధన్నపేటలోని దుకాణంలో తనిఖీలు చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు, దుకాణంలో రికార్డులు, విత్తనాల నిల్వలు తదితర విషయాలపై ఆరా తీశారు.

ఈ విషయం పై ‘న్యూస్‌టుడే’ వర్ధన్నపేట ఏడీఏ సురేశ్‌ కుమార్‌ను వివరణ కోరగా.. రైతులు కొనుగోలు చేసింది నకిలీ విత్తనం కాదన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన కేఎన్‌ఎం-1638 సుమాంజలి సీడ్స్‌ రాంపూర్‌ వారి వరి విత్తనమన్నారు. జ్ఞానాంభిక దుకాణదారులు 100 బస్తాల విత్తనాలు తీసుకొచ్చి 50 బస్తాలను రైతులకు విక్రయించినట్లు తెలిపారు. అందులో ముగ్గురు రైతులకు మాత్రమే సరైన మొలక రాలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. పరీక్షల నిమిత్తం దుకాణంలో నిల్వ ఉన్న ఈ రకం విత్తన నమూనాలు ల్యాబ్‌కు పంపామన్నారు. ఇదే రకం కొనుగోలు చేసిన మిగిలిన రైతుల పంట క్షేత్రాలను రేపు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని