logo

ప్రజాభవన్‌ వైపు.. అర్జీదారుల చూపు

సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజానీకానికి భరోసా ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 654 అర్జీలు పరిష్కారానికి నోచుకోక.. పెండింగ్‌లో ఉన్నాయి.

Published : 26 Jun 2024 04:09 IST

అర్జీ స్వీకరించినట్లు.. చరవాణికి వచ్చిన సంక్షిప్త సందేశం

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజానీకానికి భరోసా ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 654 అర్జీలు పరిష్కారానికి నోచుకోక.. పెండింగ్‌లో ఉన్నాయి. చిన్నపాటి సమస్యల పరిష్కారంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో చాలామంది బాధితులు హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరుగుతున్న ప్రజావాణికి వెళుతున్నారు. దూరభారాన్ని లెక్క చేయకుండా.. రాజధానికి వెళ్లి అక్కడి అధికారులతో తమ గోడు చెప్పుకొంటున్నారు. చాలావరకు రెవెన్యూ, పింఛను, ధరణి తదితర సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందిస్తున్నారు. ప్రజాభవన్‌లో స్వీకరించిన దరఖాస్తులకు రసీదు ఇవ్వడంతోపాటు.. అర్జీ ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. దీంతో ఎప్పటికైనా సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

తిరిగి ఇక్కడికే..

ప్రజా భవన్‌లో జిల్లాల వారీగా వచ్చిన అర్జీలను క్రోడీకరించి.. తొలుత ఆయాశాఖల వారీగా జిల్లా కలెక్టరేట్‌కు పంపించారు. కలెక్టరేట్‌లోని సిబ్బంది వాటిని పరిష్కారం కోసం ఆయా శాఖలకు బదలాయించేవారు. ప్రస్తుతం కలెక్టరేట్‌లకు రెవెన్యూ సమస్యలను మాత్రమే పంపిస్తూ.. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు నేరుగా ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత సమస్యలు ఏ దశలో ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏ అధికారులైతే.. తమ సమస్యలను పట్టించుకోలేదో.. ప్రజాభవన్‌ నుంచి వస్తే తప్పనిసరిగా పరిశీలిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో.. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా ఇప్పటివరకు జిల్లా నుంచి రెవెన్యూకు సంబంధించి మొత్తం 292 అర్జీలు రాగా.. అందులో 217 పరిశీలన దశలో ఉన్నాయి. మిగిలిన 75 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజాభవన్‌కు వచ్చే అర్జీల్లో ప్రధానంగా ఉద్యోగాల కోసం, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


అభివృద్ధి పనులు మొదలుపెట్టారు..

వరంగల్‌ అండర్‌బ్రిడ్జి వద్ద 2008 నుంచి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని.. తమ సమస్యలు పరిష్కరించాలని ఎల్వీఆర్‌ కాలనీవాసులు ప్రజాభవన్‌ ప్రజావాణిలో విన్నవించుకున్నారు. 15 ఏళ్లుగా ఒకే మీటరుపై 220 కుటుంబాల వారు విద్యుత్తు వినియోగించుకుంటున్నామని, తద్వారా ప్రతినెలా రూ.లక్షల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. కాలనీలో ఇంటింటికీ మీటర్లు ఏర్పాటుచేసి, కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. స్పందనగా.. సంబంధిత అధికారులు కాలనీలో పర్యటించి, అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు కాలనీవాసులు చెప్పారు.


పెండింగ్‌ అర్జీలపై దృష్టి సారిస్తాం..

- జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

పెండింగ్‌ అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ప్రతి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణకు ముందు సమీక్ష నిర్వహిస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెండింగ్‌ అర్జీల సంఖ్య పెరిగింది. వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ప్రజాభవన్‌ నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. ఇకపై ప్రజాభవన్‌ నుంచి వచ్చే అర్జీలను సమీక్షించేందుకు నేరుగా సంబంధిత శాఖ అధికారులకే ప్రత్యేక లాగిన్‌ ఐడీలు కేటాయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని