logo

ఉత్తమ సేవ.. పతకాల పంట!

పోలీస్‌ విధులు సాహసంతో కూడుకున్నవి.. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు.. ప్రజా సేవకు పాటుపడాలి.. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు ఎదుర్కోవాలి. నేరస్థులను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు, చాకచక్యం ప్రదర్శించాలి.

Published : 26 Jun 2024 04:06 IST

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి- న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం, మహబూబాబాద్‌ రూరల్‌

పోలీస్‌ విధులు సాహసంతో కూడుకున్నవి.. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు.. ప్రజా సేవకు పాటుపడాలి.. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు ఎదుర్కోవాలి. నేరస్థులను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు, చాకచక్యం ప్రదర్శించాలి. ఈ నేపథ్యంలో విధులను మరింత బాధ్యత, అంకితభావంతో నిర్వహించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సాహకంగా పతకాలు అందిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం సేవా, కఠిన, ఉత్తమ, మహోత్తమ సేవా పతకాలను ప్రకటించగా.. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఎంపికయ్యారు. క్రమశిక్షణ, ధైర్య సాహసాలు కనబర్చినవారికి, రిమార్కులు లేకుండా బాధ్యతలను నిర్వహించిన వారిని ఈ పతకాలు వరించాయి. వారి సేవలపై ప్రత్యేక కథనమిది.


నాన్న స్ఫూర్తితో ఉద్యోగం సాధించా..

- ఎండీ.అజారుద్దీన్, ఆర్‌ఎస్సై, భూపాలపల్లి

నాన్న హెడ్‌కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో విధులు నిర్వర్తించేవారు. నేను రెండేళ్ల వయసున్నప్పుడు నక్సల్స్‌ ఘటనలో  మృతిచెందారు. ఆయన జ్ఞాపకాలతో పెరిగాను. నాన్న స్ఫూర్తితో పోలీస్‌ కావాలన్నదే నా కల. అమ్మ ఎంతో ప్రోత్సహించారు. మొదట పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. దాదాపు 10 నెలలు ఉద్యోగం చేశా. తర్వాత పోలీస్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించి, కానిస్టేబుల్, ఆర్‌ఎస్సై ఉద్యోగాలు సాధించా. 2020 నుంచి ఆర్‌ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నా. ఉన్నతాధికారుల సూచనలు సలహాలతో విధులు నిర్వహిస్తున్నాను. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగం సవాళ్లతో కూడున్నదే అయినా.. ఇష్టంగా చేస్తాను. సేవలు గుర్తించి మొదటిసారిగా కఠిన సేవా పతకానికి ఎంపిక చేశారు.


వరద ప్రాంతాల్లో సేవలు అందించాం..

- మర్రి అనిల్, ఏఆర్‌ కానిస్టేబుల్, భూపాలపల్లి

మా కష్టాన్ని గుర్తించి కఠిన సేవా పతకానికి ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. ఇటీవల కలెక్టర్‌ చేతులమీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం అందుకున్నాను. మనం చేసిన సేవలకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. ప్రస్తుతం నేను కఠిన సేవా పతకానికి ఎంపికయ్యాను. నా సర్వీసులో ఎంతో ప్రత్యేకమైంది. 2020లో ఉద్యోగంలో చేరాను. విధుల్లో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. తట్టుకొని ముందుకెళ్లాం.. గతేడాది వరదల సమయంలో జిల్లా రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌)లో సభ్యునిగా ఉన్నాను. వరద ప్రాంతాల్లో సేవలు అందించాం. చలివాగులో గల్లంతైన మృతదేహం వెలికితీయడంలోనూ సాయపడ్డాను. 2022లో వరద ప్రాంతాల్లోనూ సేవలు అందించాం. మాది స్టేషన్‌ఘన్‌పూర్‌.. అక్కడ పోలీస్‌ ఉద్యోగం పొందినవారిని స్ఫూర్తిగా తీసుకుని పోలీస్‌ ఉద్యోగం సాధించాను.


పేద పిల్లలు చదువుకునేలా..

- ఎన్‌.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ప్రతిభను గుర్తించి సేవా పతకానికి ఎంపిక చేసింది.. సేవా పతకం రావడం ఇదే మొదటిసారి.. చాలా సంతోషంగా ఉంది. మరింత బాధ్యత కూడా పెరిగింది. గతంలో 20కి పైగా ప్రశంసాపత్రాలు వచ్చాయి.. మంచి సేవలకు గాను 10 రివార్డులు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పేద తల్లిదండ్రుల పిల్లలు చదువుకునేలా అవకాశాలు కల్పించాం. యువత ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాం. పోలీస్‌ శాఖలో చేసిన సేవలను గుర్తించి సేవా పతకానికి ఎంపిక చేసిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు.


నిరుపేదకు ఇల్లు నిర్మించాం..

- పి.దేవేందర్, సీఐ, మహబూబాబాద్‌

సేవా పతకానికి ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్వహించిన విధులకు 90కి పైగా రివార్డులు వచ్చాయి. ఉత్తమ సేవలకు నాలుగు సార్లు ప్రశంసాపత్రాలు అందుకున్నా.. నెల్లికుదురు ఎస్సైగా పని చేసిన సమయంలో ఆలేరు గ్రామంలో ఓ నిరుపేదకు ఇల్లు నిర్మించాం. ఏటా ఆమెకు నిత్యావసర వస్తువులు అందజేస్తుంటాం. మా పిల్లల పుట్టిన రోజులు, సమయం దొరికినప్పుడల్లా అనాథ పిల్లల వద్దకు వెళ్తుంటా... వారిలో మనోధైర్యాన్ని నింపడానికి కాసేపు గడుపుతుంటాను.


25 ఏళ్ల పాటు సేవలు

- శ్రీధర్‌రావు, ఇన్‌స్పెక్టర్,  సీసీఆర్‌బీ, వరంగల్‌

పోలీస్‌శాఖలో పని చేస్తూ సేవా పతకాలు రావడంతో బాధ్యత మరింత పెరిగింది.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాల్లో సేవా పతకం వచ్చింది. 25 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేశాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహించాను. చట్ట పరిధిలో పనిచేయడంతో ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ ఉద్యోగం చేసినా పేదలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహిస్తాను. ఠాణాకు వచ్చే వారికి భరోసా కల్పించేలా ఉండాలి. దీంతో ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.


సేవా పతకాలు పొందిన వారు వీరే..

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో : ఉత్తమ సేవా పతకం.. హెడ్‌ కానిస్టేబుల్‌ టి.యాదగిరి, ఏఆర్‌ ఎస్సై నర్సింహారెడ్డి. సేవా పతకం పొందిన వారిలో సీఐ కె.శ్రీధర్‌రావు, హెడ్‌కానిస్టేబుళ్లు ఎండీ సాధిక్, ఎం.భిక్షపతి, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జి.శ్రీనివాస్‌ ఉన్నారు..
జయశంకర్‌ భూపాలపల్లి : కఠిన సేవా పతకాలు పొందిన వారిలో ఆర్‌ఎస్సైలు ఎండీ.అజారుద్దీన్, ఎం.రాజేశ్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు, జె. మల్లేశ్, కె.వెంకటేశ్వర్లు, టి.రాజ్‌కుమార్, ఎం.అనిల్, కానిస్టేబుళ్లు డి.శ్రావణ్, కె.రాజు.. సేవా పతకం వరించిన వారిలో ఆర్‌ఎస్సై శివకుమార్‌ ఉన్నారు.
ములుగు : సేవా పతకం.. హెడ్‌ కానిస్టేబుల్‌ పి వెంకన్న.
మహబూబాబాద్‌ : ఉత్తమ సేవా పతకం.. జి.వీరారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ సదయ్య, సేవా పతకం పొందిన వారిలో సీఐలు పి.బాలాజీ వరప్రసాద్, పి.దేవేందర్, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ పి.వెంకన్న ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు