logo

ఆమ్యామ్యాలు ఇచ్చుకో.. తొలి జీతం పుచ్చుకో!

రూ.8 లక్షల వరకు వసూలు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వీరిలో దాదాపు 900 మందికి జీతాలు అందాయి. మిగిలిన వారికి త్వరలో రానున్నాయి. జీతం ఇవ్వడానికి ఇప్పటివరకు దాదాపు 400 మంది నుంచి సగటున రూ.2 వేల చొప్పున రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

Updated : 26 Jun 2024 05:29 IST

నర్సింగ్‌ ఆఫీసర్ల నుంచి బలవంతపు వసూళ్లు
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ టౌన్‌

రూ.8 లక్షల వరకు వసూలు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వీరిలో దాదాపు 900 మందికి జీతాలు అందాయి. మిగిలిన వారికి త్వరలో రానున్నాయి. జీతం ఇవ్వడానికి ఇప్పటివరకు దాదాపు 400 మంది నుంచి సగటున రూ.2 వేల చొప్పున రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అవి అందని వారిని కూడా సిబ్బంది మామూళ్ల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

మ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల్లో చేరిన నర్సింగ్‌ ఆఫీసర్లకు మూడు నెలల తర్వాత ఇప్పుడు జీతాలు అందుతున్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే.. తొలి జీతం తీసుకోవడానికి వారు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.. దక్షిణ సమర్పిస్తేనే సంతకం అంటూ కొందరు అధికారులు భీష్మించుకొని కూర్చోవడంతో వారంతా అవాక్కయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బంది సాగించిన ఈ వసూళ్లపర్వంపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..

ఇక్కడి నుంచే మొదలు.. 

ఉద్యోగులకు జీతాలు అందాలంటే వారి వివరాలను పాలనా విభాగం వారు జిల్లా ఖజానా (ట్రెజరీ) కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడే వసూళ్ల పర్వానికి తెరతీశారు.. తమ దగ్గర చేరిన నర్సింగ్‌ ఆఫీసర్లలో మామూళ్లు ఇచ్చినవారి వివరాలనే ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బంది ట్రెజరీకి పంపించారు.

ఒక్కొక్కరికి మూడు సార్లు ఫోన్‌

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో 281 మంది చేరారు. వీరిలో 150 మందికి జీతాలు అందించారు. ఆ సమయంలో వారిలో కొందరికి ఆరోగ్యశాఖ నుంచి రూ.2 వేల చొప్పున ఇవ్వాలంటూ ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సార్లు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇవి కూడా మధ్యవర్తుల ద్వారా చేయించారు.

జిల్లాల వారీగా ఇలా

  • భూపాలపల్లి జిల్లాలో 199 మంది పనిచేస్తున్నారు. దాదాపు మూడు నెలల వేతనాలు కావాలంటే ఆరోగ్యశాఖలోని అడ్మినిస్ట్రేషన్‌ విభాగం వారు ఒకరు మధ్యవర్తుల ద్వారా ఒక్కో నర్సింగ్‌ ఆఫీసరు నుంచి రూ. 2 వేల చొప్పున తీసుకున్నారు.
  • వరంగల్‌ 179, హనుమకొండ జిల్లాలో 179 మంది చొప్పున విధుల్లో చేరారు. వీరికి ఆమ్యామ్యాల బెడద తప్పదు.
  • జనగామ జిల్లాలో 158 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు విధుల్లో చేరారు. వేతనాల కోసం జిల్లా ఖజానా కార్యాలయం నుంచి రావాల్సిన ఉద్యోగ గుర్తింపు నెంబరు కోసం ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి రూ.2 వేల చొప్పున వసూలు చేశారు.
  • ములుగు జిల్లాలో 18 మంది పనిచేస్తున్నారు. వారికి ఇటీవలే ఖజానా కార్యాలయం నుంచి ఉద్యోగ గుర్తింపు నెంబర్లు ఇచ్చారు.. ఇంకా వేతనాలు అందలేదు. వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడి ఓ అధికారిని కలవాలంటూ వారికి సమాచారం పంపినట్లు తెలిసింది.

ఎంజీఎంలో వసూళ్ల తీరును ముందే బయటపెట్టిన ‘ఈనాడు’

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో 120 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారి జీతాలకు సంబంధించిన దస్త్రాలు ఖజానా కార్యాలయానికి పంపకుండా తాత్సారం చేశారు.. మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు వసూలు చేశాకే ఖజానా కార్యాలయానికి పంపించారు. గత ఏప్రిల్‌ 14న ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. ‘అందని వేతనాలు.. అడిగితే వసూళ్లు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి నర్సింగ్‌ ఆఫీసర్లకు ఉద్యోగ గుర్తింపు పత్రాలు అందించారు. వసూళ్లకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకున్నారు.


డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రాలేదు

- డా.శ్రీనివాస్, సూపరింటెండెంట్, మహబూబాబాద్‌ జిలా ఆసుపత్రి

వేతనాలు పొందే క్రమంలో డబ్బులు అడిగినట్లు కొత్తగా విధుల్లో చేరిన నర్సింగ్‌ ఆఫీసర్లు మాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.  ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా.. డబ్బులు అడిగినా వెంటనే మాకు ఫిర్యాదు చేయాలని వారికి తెలియజేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని