logo

నెరవేరని పేదల సొంతింటి కల

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత భారాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. లక్ష్యం బాగున్నా.. క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం, ఎంపిక మాత్రం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది.

Published : 26 Jun 2024 03:58 IST

లబ్ధిదారుల ఎదురుచూపు

పాలకుర్తి మండలం గూడూరులో పూర్తయినా పంపిణీకి నోచక..

పాలకుర్తి, న్యూస్‌టుడే: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత భారాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. లక్ష్యం బాగున్నా.. క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం, ఎంపిక మాత్రం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. మంజూరైనవి వేల సంఖ్యలో ఉన్నా, ఇప్పటి వరకు అందిన వారు వందల్లోనే ఉన్నారు. జిల్లాలో రెండు పడకగదుల ఇళ్ల ప్రస్తుత స్థితిగతులపై కథనం..

ప్రాంతాలు అధ్వానంగా తయారై..

జిల్లాలో 4,372 రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. పాలకుర్తిలో 2,034, జనగామలో 1,193, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 1,145 మంజూరయ్యాయి. మూడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు కేవలం 670 మందికి మాత్రమే కేటాయించారు. ఒక మండలంలో రెండు, మూడు గ్రామాలు మినహా, మిగతా ఏ పల్లెల్లో ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగలేదు. పూర్తయిన చోట లబ్ధిదారులను గుర్తించినా, కేటాయించలేదు. నిర్మాణ ప్రదేశాలు పిచ్చిమొక్కలు, నీటి మడుగులతో అధ్వానంగా తయారయ్యాయి. ఉన్నత, దిగువ స్థాయి అధికారులు పలుమార్లు సమీక్షించినా పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు నిలిచిపోయాయి.

గూడూరులో ఆరేళ్లుగా నిరీక్షణ..

పాలకుర్తి మండలం గూడూరులో తొలి దశలో పూర్తయిన నిర్మాణాలు గత ఆరేళ్లుగా పంపిణీకి నోచుకోవడం లేదు. ప్రస్తుతం చాలా గృహాలు నిర్వహణ కరవై శిథిలావస్థకు చేరుతున్నాయి. కిటికీలతోపాటు ఇతరాత్ర సామగ్రి పాడవుతున్నాయి. కొన్ని కిటికీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. మూడు నెలల క్రితం స్థానికులు నివాసాల్లోకి చొరబడగా, పోలీసులు మాట్లాడి, బయటకు పంపించారు. బమ్మెరలో ఏళ్లుగా పనులు కొనసాగుతుండటంతో పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి. జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి త్వరితగతిన పూర్తి చేసి, అందజేయాలని కోరుతున్నారు.

జిల్లా వివరాలు..

మంజూరైన రెండు పడక గదుల ఇళ్లులు : 4,372
టెండర్‌ ప్రక్రియ  పూర్తయినవి : 3,360
పూర్తికానివి : 1,012
గుర్తించిన లబ్ధిదారులు: 1,257
నివాసాలు పొందిన వారు : 670
కేటాయించిన నిధులు : రూ.236 కోట్లు


అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

స్టేషన్‌ఘన్‌పూర్‌లో పిల్లర్ల దశలోనే..

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని సముద్రాల గ్రామ శివారులో సుమారు 40 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో 10 చివరి దశలో ఉండగా, మిగతావి ఇంకా మొదలుకాలేదు. 2018లో అప్పటి ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. గతంలో అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినా.. ఇప్పటివరకు ఎవరికీ కేటాయించలేదు. దీంతో కొందరు రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. 2019లో 100 ఇళ్లు కేటాయించినట్లు ప్రకటించినా, ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. 

- దామోదర్‌రావు, జిల్లా గృహ నిర్మాణశాఖ ఈఈ

ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వారి మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. పలు కారణాలతో కొన్ని టెండర్లు పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తయిన వాటిని పంపిణీ చేసేలా చొరవ తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని