logo

గుప్త నిధుల పేరుతో భారీ మోసం

ఇంట్లో వరుసగా కుటుంబ సభ్యులు చనిపోతుండటంతో గుప్త నిధులు వెలికితీస్తే మరణాలు ఆగిపోతాయని ఓ ఘరానా మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంఘటన మంగళవారం జనగామ జిల్లా కొడకండ్ల మండల శివారులో చోటుచేసుకుంది.

Published : 26 Jun 2024 03:55 IST

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాజమహేంద్రనాయక్‌

పాలకుర్తి, న్యూస్‌టుడే: ఇంట్లో వరుసగా కుటుంబ సభ్యులు చనిపోతుండటంతో గుప్త నిధులు వెలికితీస్తే మరణాలు ఆగిపోతాయని ఓ ఘరానా మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంఘటన మంగళవారం జనగామ జిల్లా కొడకండ్ల మండల శివారులో చోటుచేసుకుంది. సర్కిల్‌ పరిధిలోని పాలకుర్తిలో డీసీపీ రాజమహేంద్రనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు సభ్యులు వివిధ కారణాలతో చనిపోయారు. మూడు నెలల కింద రాజన్న సిరిసిల్ల జిల్లా మేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి రజనీకాంత్‌ కొడకండ్లలో ఆ కుటుంబానికి చెందిన మహిళను కలిసి వారి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చెప్పాడు. దానికి మీ ఇంట్లో గుప్త నిధులు వెలికితీయాలని, లేకుంటే మిగతా వారు కూడా మరణిస్తారని చెప్పడంతో ఆమె నమ్మింది. తొలుత పూజ చేయాలని అవి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రూ.1.75 లక్షలు పెట్టి తీసుకోవాలని సూచిస్తారు. రజినీకాంత్‌తో పాటు వేములవాడకు చెందిన మోటం సురేశ్, నరసింహ, వినుకొండ సంపత్‌కుమార్‌ అనే వ్యక్తులు పూజారులని నమ్మిస్తారు. వారు గుప్త నిధులను వెలికి తీస్తారని చెప్తాడు. వారు పరిశీలించి, ఇంటి ఆవరణలో ఎవరూ లేని సమయంలో చిన్న చిన్న బిందెలను పాతి పెట్టి, వారి సమక్షంలో తీసి చూపిస్తారు. ప్రత్యక్షంగా చూసిన బాధితురాలు వారిని మరింత బలంగా నమ్మింది. వీటిని వెలికితీయడానికి పూజా సామగ్రికి రూ.9.20 లక్షలు ఖర్చయిందని చెప్పగా ఇస్తారు. అనంతరం మరో పూజ చేయాలని అందుకు మరో రూ.14 లక్షలు అవుతాయని చెప్పగా, అందులో రూ.7 లక్షలు ఇచ్చారు. మిగతావి పూజ అనంతరం ఇచ్చేలా ఒప్పందం జరిగింది. దీనిపై అనుమానం వచ్చిన ఆ మహిళ రహస్యంగా కొడకండ్ల పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై వరంగల్‌ సీపీ ఆదేశాలతో ఏసీపీ నర్సయ్య, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై శ్రవణ్‌కుమార్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా డబ్బును కొడకండ్ల శివారులో ఇస్తామని చెప్పడంతో నిందితుల్లో ఇద్దరైన నరసింహ, సురేష్‌ రాగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారి నుంచి రూ.15.47 లక్షల నగదు, 540 వెండి రేకులు, 76 బంగారపు రేకులతోపాటు ఓ కారు, రెండు సెల్‌ఫోన్లు, పూజకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. నిందితులు ఇదే తరహా మోసాలను గతంలో వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పాల్పడ్డారని, వారిపై కేసులు కూడా ఉన్నాయన్నారు. చేధించిన పోలీసులకు డీసీపీ రివార్డులు అందజేశారు.

స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, పూజా సామగ్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు