logo

లింగ నిర్ధారణ పరీక్షలు.. ముఠా అరెస్టు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్కానింగ్‌ యంత్రం, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

Published : 26 Jun 2024 03:48 IST

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ దేవేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్కానింగ్‌ యంత్రం, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాజీపేట మండలం కడిపికొండకు చెందిన బస్కే స్రవంతి, ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామానికి చెందిన కాసిరాజు దిలీప్‌ (వీరిద్దరు ప్రస్తుతం రాయపురంలో నివాసం ఉంటున్నారు.),  హనుమకొండ కుమారపల్లికి చెందిన జంగా రాజమణి, వరంగల్‌ కాశిబుగ్గకు చెందిన ఏకుల నరేష్‌ నలుగురు ముఠాగా ఏర్పడి హనుమకొండ వేయి స్తంభాల ఆలయం, గుడి బండల్‌ సమీపంలో స్కానింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంలో స్రవంతి ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. రెండు నెలల క్రితం రాజమణి సమీప బంధువుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరగా కాసిరాజు దిలీప్‌ సహకారంతో చేశారు. గర్భస్థ శిశువు అమ్మాయి అని తెలియడంతో గర్భస్రావం చేయాలని కోరగా.. కాశిబుగ్గలోని ప్రవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏకుల నరేష్‌ వద్ద స్రవంతి మాత్రలు తీసుకొని మహిళకు ఇచ్చారు. మాత్రలు వేసుకున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో స్రవంతి, రాజమణి ఇద్దరు కలిసి బాధిత మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యారు. జరిగిన విషయాన్ని బాధిత మహిళ వైద్యులకు చెప్పడంతో వారు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆరోగ్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హనుమకొండ పోలీసులు నిందితులను మంగళవారం పట్టుకొన్నారు. స్రవంతి గతంలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన కేసులో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చాక మళ్లీ అదే పని మొదలు పెట్టారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామని ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు