logo

ప్రజా భవన్‌కు బారులు

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో చేపడుతున్న ప్రజావాణికి జిల్లా నుంచి బారులుదీరుతున్నారు.

Published : 26 Jun 2024 03:28 IST

సమస్యలపై హైదరాబాద్‌కు వెళ్తున్న బాధితులు

హనుమకొండ కలెక్టరేట్, భీమదేవరపల్లి, న్యూస్‌టుడే : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో చేపడుతున్న ప్రజావాణికి జిల్లా నుంచి బారులుదీరుతున్నారు. జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ నేరుగా రాజధాని బాట పడుతున్నారు. ఉన్నతాధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలకు పంపిస్తున్నారు. దీని ద్వారా ఆ దరఖాస్తు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. ప్రజా భవన్‌లో వారినికి రెండ్రోజులు జరుగుతున్న ప్రజా దర్బార్‌కు హనుమకొండ జిల్లా ప్రజలు హాజరై ఇస్తున్న వినతులపై ప్రత్యేక కథనం..

జిల్లా నుంచి 320 దరఖాస్తులు..

జిల్లా నుంచి ప్రజా భవన్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెళ్తున్నాయి. అక్కడికి వెళ్లిన వాటిని పరిశీలించిన అధికారులు వాటిలో రెవెన్యూ పరమైన వాటిని పరిష్కారం కోసం జిల్లాకు పంపిస్తున్నారు. ఇతర శాఖలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పొందుపరచి.. సంబంధిత శాఖల అధికారులు చూసుకొని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్‌కు వెళ్లి వినతులు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు నిరాశకు గురవుతున్నారు. అయితే పరిష్కారం కాని సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, భూ సమస్యలపై వచ్చే అర్జీల్లో ఎక్కువగా కోర్టులో కేసులు ఉన్నవే ఉంటున్నాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. వాటితో పాటు సాదాబైనామా వినతులు వస్తున్నాయని అంటున్నారు. అర్హత లేనివారు సైతం పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్నవి మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారు. వాటి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.

వారసత్వ భూమి ఇతరులకు పట్టా చేశారు

భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన కట్కూరి వీరయ్య.. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారని ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి ప్రజాదర్బార్‌లో వినతిపత్రం ఇచ్చారు. భూమి తనకు ఇప్పించాలని కోరారు. సర్వే నెంబరు 86లో రెండు ఎకరాల భూమి ముగ్గురు అన్నదమ్ములకు వారసత్వంగా వచ్చింది. కట్కూరి లింగయ్య, దుర్గయ్య, వీరయ్యలు ఆ భూమిని 0.26 గుంటలుగా పంచుకున్నారు. రూ.1.50 లక్షలు వెచ్చించి ఫెన్సింగ్‌ వేసుకున్నారు. అయితే హనుమకొండకు చెందిన వ్యక్తి ఆ భూమి తనదని, తనకు పట్టా ఉందంటూ ఫెన్సింగ్‌ తొలగించడంతో వీరయ్య రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజాదర్బార్‌ను ఆశ్రయించారు. తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, భూమి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.


పరిష్కారం కానివే ఎక్కువగా వస్తున్నాయి..

- వైవీ గణేష్, డీఆర్‌వో హనుమకొండ

జిల్లా ప్రజలు ప్రజా దర్బార్‌లో ఇచ్చిన వినతులు, దరఖాస్తుల్లో రెవెన్యూ సంబంధిత వాటిని ఇక్కడికి పంపిస్తున్నారు. అవకాశం ఉన్నవి వెంటనే పరిష్కరిస్తున్నాం. చాలా వరకు దరఖాస్తులు పరిశీలిస్తే కోర్టు కేసులున్న తాగాదాలు, సాదా బైనామాలే అధికంగా ఉంటున్నాయి. అవి మా పరిధిలో ఉండవు. ప్రజా దర్బార్‌ నుంచి వచ్చిన వినతులను వెంట వెంటనే సంబంధిత తహసీల్దార్లకు పంపిస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని