logo

స్పందన సరే.. పరిష్కారమేది..?

సమస్యలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో హైదరాబాద్‌లోని జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా నుంచి అనేక మంది దరఖాస్తులను సమర్పిస్తున్నారు.

Published : 26 Jun 2024 03:27 IST

ప్రజావాణి వినతులపై ఫిర్యాదుదారుల ఆవేదన

మహబూబాబాద్, న్యూస్‌టుడే: సమస్యలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో హైదరాబాద్‌లోని జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా నుంచి అనేక మంది దరఖాస్తులను సమర్పిస్తున్నారు. వాటిని పరిశీలించిన ప్రజావాణి నిర్వహణ అధికారులు ఆ సమస్యను పరిశీలించి వాటిని పరిష్కరించాలంటూ తిరిగి జిల్లాకే పంపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఆ వినతులపై స్పందించినా పరిష్కారాలు మాత్రం కనిపించడం లేదు. 

భూ వివాదాలే అధికం..

జిల్లా నుంచి ప్రజావాణిలో సమర్పించిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూముల వివాదాలే ఉంటున్నాయి. ధరణి పోర్టల్‌ ప్రారంభమైన నాటి నుంచి భూ సమస్యలు పెరిగిపోయాయంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఆసరా పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరుతో వివిధ శాఖలకు సంబంధించి నాలుగైదు దరఖాస్తులు ఉన్నాయి.

కోర్టు వివాదాలు, సరైన ఆధారాలు లేని సమస్యలను ఎక్కడికెళ్లినా వాటికి పరిష్కారం లభించదని ఓ అధికారి పేర్కొన్నారు. ఎక్కువగా భూముల సమస్యలే ఉన్నందున ధరణి పోర్టల్‌ సవరణ ప్రక్రియ ముగిసి కొత్తగా చేపట్టనున్న కార్యక్రమంలో వాటికి పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు.

ఇదీ పరిస్థితి.. జిల్లా నుంచి హైదరా బాద్‌ ప్రజావాణికి 206 దరఖాస్తులు వెళ్లగా 17 దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. మిగిలినవాటిపై సరైన సమాధానం లభించడం లేదు.
మరికొన్ని సమస్యలు..

  • బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన  ఒంటరి మహిళ రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైతే ఆ మహిళా సమస్యకు పరిష్కారం లభించనుంది.
  • డోర్నకల్‌ మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఫిర్యాదు చేశారు.
  • నెల్లికుదురు మండలానికి చెందిన ఓ మహిళ తన భూమిని ఇతరుల పేరిట రికార్డు చేసుకున్నారని ఫిర్యాదు చేశారు.
  • మహబూబాబాద్‌  పట్టణానికి చెందిన ఓ గిరిజన రైతు తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని ఓ వ్యక్తి వేరే సర్వే నెంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఆ భూమిని విక్రయిస్తున్నారంటూ విన్నవించారు.

ఉద్యోగం ఇవ్వాలని..

- పి.సైదులు, చిట్యాల, పెద్దవంగర మండలం.

మా గ్రామంలో కొన్నేళ్లుగా సాక్షరభారత్‌ కో-ఆర్డినేటర్‌గా పని చేశాను. ఆ తర్వాత పంచాయతీ కారోబార్‌గా విధులు నిర్వహించాను. వివిధ రాజకీయ కారణాలతో నన్ను ఆ విధుల నుంచి తొలగించారు. తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ప్రజాదర్బార్‌లో వినతి పత్రం ఇచ్చాను. ముందుగా  మీ విద్యార్హతతో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోమని జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి లేఖ పంపించారు.  దీంతో కార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు సమాచారం ఇస్తామని చెప్పారు.


 సమాచారం ఇచ్చారు..

- ఎం.మధు, కోమటిపల్లి, కేసముద్రం మండలం.

సివిల్‌ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన నాకు మైనింగ్‌ శాఖ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో సర్వేయర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ముఖాముఖి కోసం పిలిచినప్పుడు నేను అందుబాటులో లేను. తర్వాత అధికారులను వెళ్లి కలిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయమై హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వినతిపత్రం అందించాను. దీంతో వారం రోజుల తర్వాత స్పందించిన మైనింగ్‌ శాఖ అధికారులు లేఖ పంపించారు. సంబంధిత శాఖకు చెందిన మేనేజింగ్‌ డైరెక్టర్లు మారుతున్నారని పూర్తి స్థాయిలో ఎండీ లేకపోవడం వల్ల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు నియమించడం లేదంటూ సమాచారం పంపించారు.


సంబంధిత కార్యాలయాలకు పంపిస్తున్నాం

- ఎం.డేవిడ్, జిల్లా అదనపు కలెక్టర్‌.

జిల్లావాసులు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం కోసం మా వద్దకు వస్తున్నాయి. వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించి పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాం. న్యాయపరమైన అంశాలు ఉంటే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని