logo

మామను హతమార్చిన అల్లుడికి జీవిత ఖైదు

మామను గొడ్డలితో నరికి చెరువులో పడేసి ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన అల్లుడికి జీవితఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పుచెప్పారు.

Published : 26 Jun 2024 03:23 IST

వరంగల్‌ న్యాయవిభాగం, హసన్‌పర్తి, న్యూస్‌టుడే: మామను గొడ్డలితో నరికి చెరువులో పడేసి ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన అల్లుడికి జీవితఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పుచెప్పారు. హసన్‌పర్తి ఎస్సై అశోక్,  ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామానికి చెందిన జిక్కి ఎల్లయ్య (55) తన కుమార్తె స్వాతిని హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన పోతరాజు వెంకటేశ్‌ (35)కు ఇచ్చి 2013లో వివాహం చేశారు. వీరికి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. పెద్దలు పలుమార్లు సర్దిచెప్పినా మార్పు రాలేదు. ఈ క్రమంలో 2020 అక్టోబరు 6న ఎల్లయ్య హసన్‌పర్తిలోని తన కుమార్తె ఇంటికి వచ్చి, మరుసటిరోజు ఉదయం స్వగ్రామం వెళుతున్నట్లు చెప్పి బయల్దేరారు. మార్గమధ్యలో హసన్‌పర్తిలోని నల్లగుట్ట వద్ద ఉన్న దుకాణంలో మద్యం తాగారు. అనంతరం అల్లుడు వెంకటేశ్‌కు ఫోన్‌ చేసి పిలిపించుకున్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగి అక్కడే కొద్దిసేపు నిద్రించారు. సాయంత్రం మళ్లీ హసన్‌పర్తి చెరువుకట్ట పైకి కల్లు తాగడానికి వెళ్లారు. ఆ సమయంలో తన కుమార్తెను తరచూ ఎందుకు వేధిస్తున్నావంటూ ఎల్లయ్య అల్లుడిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్‌ అక్కడే ఉన్న గొడ్డలితో దాడి చేయడంతో మామ ఎల్లయ్య తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే వదిలి వెళితే తానే చంపినట్లు తెలిసిపోతుందనుకొని వెంకటేశ్‌ ఆ మృతదేహాన్ని చెరువులో పడేశాడు. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎ.శ్రీధర్‌రావు దర్యాప్తులో వెంకటేశ్‌ తన మామను హతమార్చినట్లు తేలింది. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్ష విధించింది. ఈ కేసును ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.రాజమల్లారెడ్డి వాదించగా.. కోర్టు హెడ్‌ కానిస్టేబుల్‌ వి.రవీందర్‌ విచారణ సందర్భంగా పలువురు సాక్షులను హాజరుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని