logo

జేఎన్‌టీయూ గురజాడకు మకిలి

వెంకట సుబ్బయ్య ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. చదివాడు.  నేనే అతన్ని ఉపకులపతిగా ఎంపిక చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు మంచి పేరుంది.

Published : 03 Jul 2024 05:05 IST

గతంలో ఉప కులపతిని తానే నియమించానన్న బొత్స
తాజాగా వీసీ వెంకట సుబ్బయ్య రాజీనామా

నిర్మాణంలో ఉన్న పరిపాలనా భవనం 

వెంకట సుబ్బయ్య ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. చదివాడు.  నేనే అతన్ని ఉపకులపతిగా ఎంపిక చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు మంచి పేరుంది. మీరు చెప్పినంత వరకూ అతనిది రాయలసీమని తెలియదు. 
- అప్పట్లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్న మాటలివి. 

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం: మంత్రి బొత్స వ్యాఖ్యలే జేఎన్‌టీయూ గురజాడ-విజయనగరం ఉప కులపతి వెంకట సుబ్బయ్యపై వైకాపా ముద్రపడేలా చేశాయి. 2023 ఫిబ్రవరి 10న ఉప కులపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతిగా పనిచేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్, కురుపాం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆచార్యులు, అసోసియేట్‌ ఆచార్యులు, సహాయ ఆచార్యుల నియామకాలకు సంబంధించి 135 పోస్టులకు 2023 అక్టోబరు 30న ప్రకటన విడుదల చేశారు. జేఎన్‌టీయూకు చెందిన 51 మంది ఫ్యాకల్టీతో పాటు ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ ప్రకటన, రిజర్వేషను ఖరారుపై న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలవ్వడంతో దరఖాస్తులే స్వీకరించాలని, ప్రొవిజల్‌ జాబితా జారీ ప్రక్రియ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. జేఎన్‌టీయూలో వాటిని తుంగలోకి తొక్కారన్న ఆరోపణపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

  • తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలు నిర్వహించినపుడు పాత ప్రశ్నపత్రాలే మళ్లీ ఇవ్వడం, లీకేజీలు, ధ్రువపత్రాల జారీలో జాప్యంపై అపవాదులు వచ్చాయి. విద్యార్థులు యూజీసీ, ఏఐసీటీయూకి ఫిర్యాదు చేశారు. 2023-24లో సెమిస్టర్‌ పరీక్షల్లో ప్రైవేటు కళాశాలలకు ఒక పేపరు బదులు ఇంకొకటి ఇచ్చి.. సిలబస్‌లో లేకపోవడంతో అప్పటికప్పుడు ఇంకో ప్రశ్నపత్రాన్ని ఇచ్చి పరీక్ష నిర్వహించారు. 2022-23 వార్షిక పరీక్షల్లో విశాఖ జిల్లాలో బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. 
  • పొరుగు సేవల కింద ప్రస్తుతం 67 మంది పనిచేస్తుండగా.. టెండర్‌పై సెక్యూరిటీగా 60, హౌస్‌ కీపింగ్‌లో 60 మందిని తీసుకున్నారు. సెక్యూరిటీ సేవలను విద్యాలయం విభాగాల్లో ఉపయోగిస్తున్నారు. పొరుగు సేవల విభాగంలో సెక్యూరిటీ, హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగాలకు కాసులివ్వని వారిని తొలగించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. 

నాణ్యతెంత..?

విశ్వవిద్యాలయానికి ముందే అకడమిక్‌ బ్లాక్‌-3 మంజూరైంది. విశ్వవిద్యాలయం హోదా వచ్చిన తర్వాత పరిపాలనా భవనంగా మార్చారు. రూ.20 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. నాణ్యత నియంత్రణ విభాగం తనిఖీలు లేకుండా రూ.7 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు వర్సిటీ పాలనలో లోపాలను వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు