logo

చేతులెత్తేసిన రాక్రీట్‌

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు గుంకలాం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీ లేఅవుట్‌లో థర్డ్‌ ఆప్షన్‌ కింద రాక్రీట్‌ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Published : 03 Jul 2024 05:01 IST

అసంపూర్తిగా గుంకలాం కాలనీ ఇళ్లు

ఇంకా పునాదుల్లోనే నిర్మాణాలు 

ఈనాడు, విజయనగరం: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు గుంకలాం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీ లేఅవుట్‌లో థర్డ్‌ ఆప్షన్‌ కింద రాక్రీట్‌ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోనే మూడో అతి పెద్దదైన ఈ కాలనీని నాలుగేళ్లలో పూర్తి చేయడంలో విఫలమైంది. 

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈ లేఅవుట్‌లో 397.02 ఎకరాల్లో 12,301 ప్లాట్లు వేసి 12,149 మందికి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో ఆప్షన్‌ - 1, 2 కింద 4,420 మంది లబ్ధిదారులు, ఆప్షన్‌ - 3 కింద 5,761 మందికి కలిపి 1,0181 గృహాలు మంజూరు చేశారు. ఇందులో 10,139 మంది లబ్ధిదారుల వివరాలు హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేశారు. వైకాపా పెద్దల అండతో సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని 5,097 మందివి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఆదేశాల మేరకు అప్పట్లో రాక్రీట్‌ సంస్థకు అప్పగించారు. ఆప్షన్‌ - 3 కింద పనులు చేపట్టిన ఈ సంస్థ ఇప్పటి వరకు ప్లింత్‌ భీం స్థాయిలో 4,234, పునాదుల దశలో 483, లింటల్‌ స్థాయిలో 13, పైకప్పు స్థాయిలో 170, స్లాబు స్థాయిలో 64 పూర్తి చేసింది. ఇంకా 133 ఇళ్ల పనులు ప్రారంభించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మూడున్నరేళ్లలో పనులు వేగవంతం చేయలేకపోవడం, గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో రాక్రీట్‌ సంస్థ తాజాగా చేతులెత్తేసింది. ఇళ్ల నిర్మాణ పనులన్నీ అసంపూర్తిగా  నిలిపివేసింది.  


నాణ్యతపై నోటీసులిచ్చాం

రాక్రీట్‌ సంస్థ నిర్మిస్తున్న కొన్ని గృహాలు నాసిరకంగా ఉన్నాయని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ వి.శ్రీనివాస్‌ తెలిపారు. పనుల నాణ్యతపై విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో తనిఖీలు చేయించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. గత నెల 27న ‘గూడు పుఠాణి’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. సకాలంలో పూర్తి చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో గతంలో 664 గృహాలను ఇతర సంస్థలకు, నైపుణ్యం కలిగిన తాపీ మేస్త్రీలకు లబ్ధిదారుల అంగీకారంపై అప్పగించామని ఆయన పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని