logo

మీసేవలు ఎలా ఉన్నాయ్‌..?

ఉమ్మడి జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణపై అధికారులు గడిచిన రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Updated : 03 Jul 2024 06:12 IST

ఉమ్మడి జిల్లాలో కేంద్రాల తనిఖీ

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణపై అధికారులు గడిచిన రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సేవలు అమలవుతున్న తీరు? ఏ సేవకు ఎంతెంత మొత్తం వసూలు చేస్తున్నారు? ప్రభుత్వానికి ఏ మేరకు జమ చేస్తున్నారో? పరిశీలిస్తున్నారు. సచివాలయాలు రాకముందు మీసేవ కేంద్రాల ద్వారానే ప్రజలకు సేవలందేవి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2022 జనవరి 26 నుంచి  549 రకాల ఈ-సేవలను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇవి క్షేత్రస్థాయిలో అందేది అంతంత మాత్రమే.  విజయనగరం, పార్వతీపురం మన్యం రెండు జిల్లాల్లో చూసుకుంటే గరిష్ఠంగా 222 సేవలు అందుతున్నట్లు అధికారిక గణాంకాలు బట్టి తెలుస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 593 మీసేవ కేంద్రాలుండేవి. గత అయిదేళ్లలో సుమారు 50 వరకు మూతపడినట్లు అంచనా. 

సచివాలయాల్లో సేవలు తొలుత ఉచితమని తర్వాత మీసేవలు తరహాలోనే ధరలు నిర్దేశించడంతో ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. అమలైన వాటిలో సగం దరఖాస్తులు కుల, ఆదాయ, ఓబీసీ, ధ్రువీకరణ పత్రాలవే ఉంటున్నాయి. ఆర్‌ఓఆర్‌1బి, ఆధార్‌ నమోదు, అప్‌డేట్, బయోమెట్రిక్, చరవాణి అనుసంధానం, మ్యూటేషన్‌ తప్పుల సవరణ, బదిలీ, కంప్యూటరైజేషన్‌ అడంగల్‌ ప్రధానమైనవి. ఇతర శాఖలకు సంబంధించి వృద్ధుల పింఛను, బియ్యం కార్డులు, విద్యుత్తు బిల్లులు చెల్లింపు వంటివి సేవలను కొందరు వినియోగించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ సేవలు గతేడాది జూన్‌ నుంచి అమల్లోకి తెచ్చారు. కార్యదర్శి, డిజిటల్‌ సహాయకులకు  ఆరు నెలలు శిక్షణ ఇచ్చి మూడు విడతలుగా సేవలను అన్ని సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్టోబరులో కార్యదర్శులకు సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా కల్పిస్తూ గజిట్‌ ఉత్తర్వులిచ్చినా, అమలు చేసేందుకు తగిన సిబ్బంది, పరికరాలు లేవు. స్కానర్లు, ఐరిష్‌ మిషన్లు, డాక్యుమెంట్‌ స్కానర్లు లేకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. జారీ చేస్తున్న ధ్రువపత్రాల్లో తప్పులు దొర్లడంతో సరిచేసేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో లాగిన్లలో చేయాలి. గతేడాది ఆగస్టులో నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాల్లో సుమారు ఆరు లక్షల మందికి కుల, ఆదాయ ధ్రువపత్రాలు  ఆరు లక్షల మందికి ధ్రువపత్రాలు జారీ చేశారు.  వీటిలో తప్పులు రావడంతో ఎక్కువ మంది మళ్లీ మీసేవ కేంద్రాలను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాల సచివాలయాల అధికారులు నిర్మలాకుమారి, రామచంద్రరావు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని