logo

పంచాయతీలకు ఊపిరి

వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధుల లేమితో పల్లెల్లో సమస్యలు రాజ్యమేలాయి. సుపరిపాలనకు దూరమయ్యాయి. పంచాయతీ పాలకవర్గ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి.

Published : 01 Jul 2024 05:31 IST

కేంద్రమిచ్చే నిధులు ఇక నేరుగా స్థానిక సంస్థలకే
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలపై సర్పంచుల హర్షం

‘‘ఇక మీదట కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు రెండు వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకే జమయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తాం. స్థానిక సంస్థల అభివృద్ధికి కేటాయించే ప్రతి పైసా వాటికే దక్కేలా చూస్తాం. గతంలో మాదిరిగా ఉండదు’’.. 

  • గత నెల 20న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడించిన మాట.

మక్కువ మండలం కోన పంచాయతీలో కాలువలు,  రోడ్డు లేక మురుగు ఇలా పారుతోంది. ఈ పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలు విడుదలయ్యాయి. గత ప్రభుత్వం రోడ్లు, కాలువలు, వీధి దీపాల నిర్వహణకు వినియోగించలేకపోయింది. వీధి దీపాల విద్యుత్తు వినియోగానికి సంబంధించి బిల్లుల కింద రూ.3 లక్షలు తీసుకుంది. చివరి మూడేళ్లు ఉపాధి నిధులొచ్చినా అభివృద్ధి చేయలేకపోయింది.   


ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్, చీపురుపల్లి గ్రామీణం, మక్కువ: వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధుల లేమితో పల్లెల్లో సమస్యలు రాజ్యమేలాయి. సుపరిపాలనకు దూరమయ్యాయి. పంచాయతీ పాలకవర్గ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి. ఎన్నికైన పంచాయతీ ప్రథమ పౌరులకు గత ప్రభుత్వం విలువ లేకుండా చేసింది. ఏ పనీ చేయకుండా వారి చేతులు కట్టేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 1,228 పంచాయతీలకు అయిదేళ్లలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.617 కోట్లు విడుదలైనా పంచాయతీ ఖాతాలు ఖాళీ అయ్యాయి. రోడ్లు, మురుగు కాల్వలకు చిన్న చిన్న మరమ్మతుల పనులేవీ అయిదేళ్లలో నోచుకోలేకపోయాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏరికోరి ఈ శాఖను తీసుకున్నారు. అభివృద్ధిపై దృష్టి పెడతారని, పల్లె సిగలో ప్రగతిపూలు పూయిస్తారని సర్పంచులు, పల్లె ప్రజలు ఎదురుచూస్తున్నారు.
విజయనగరం జిల్లాలో 777, పార్వతీపురం మన్యం జిల్లాలో 451 పంచాయతీలు ఉన్నాయి. తెదేపా హయాంలో ఉపాధి హామీ పథకం కింద ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సిమెంటు రోడ్లు, కాల్వలు నిర్మించారు. పంచాయతీలకు సొంత ఆర్థిక వనరులు ఉండాలనే దూరదృష్టితో చెత్త నుంచి సంపద కేంద్రాలను ఏర్పాటు చేశారు. 70 శాతం పంచాయతీల్లో ఈ కేంద్రాలు రూపుదిద్దుకోగా ప్రస్తుతం 10 శాతం లోపే ఉనికిని చాటుకుంటున్నాయి. 

గల్లా పెట్టెలు ఖాళీ

వైకాపా అధికారంలోకి వచ్చాక పంచాయతీల నిధులు ఖాళీ చేశారు. రెండు జిల్లాల పంచాయతీల నుంచి సుమారు రూ.500 కోట్లకు పైగా ఇతర అవసరాల కోసమని తీసుకున్నారు. దీంతో సర్పంచులు అభివృద్ధి పనులు చేయలేని స్థితి. కొందరు సొంత సొమ్ముతో పనులు చేయించారు. వాటి బిల్లులూ చెల్లించకపోవడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు. కాసుల్లేక గ్రామాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తలసరి గ్రాంటు, సీనరేజి, స్టాంప్‌ డ్యూటీపై పంచాయతీల వాటా నిధులు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులే వారికి ఆధారమయ్యాయి. ఆ నిధులూ ప్రభుత్వం మళ్లించడంతో పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.

ప్రకటనల్లోనే ప్రాధాన్యం

గత వైకాపా ప్రభుత్వం గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 393 సచివాలయ భవనాలకు, 214 పూర్తయ్యాయి. 373 ఆర్బీకేలకు 176 నిర్మించారు. 299 హెల్త్‌ క్లినిక్‌లకు 121 పూర్తయ్యాయి. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పనులెన్నో. రూ.86.16 కోట్ల అంచనా వ్యయంతో పది హై ఇంపాక్ట్‌ రోడ్ల లక్ష్యంలో ఒక్కటీ పూర్తి చేయలేకపోయారు. బిల్లులివ్వరని గుత్తేదార్లు ముందుకు రాలేదు. 111 బీటీ రోడ్డు పనుల్లో విజయనగరం డివిజన్‌లో 85 పనులు పూర్తయ్యాయి. 2,595 సిమెంటు రోడ్డు పనుల్లో పార్వతీపురం డివిజన్‌లో 2567 పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పార్వతీపురం డివిజన్‌లో రూ.87.71 కోట్ల వ్యయంతో పది చిన్న వంతెనలు మంజూరవ్వగా మూడే పూర్తయ్యాయి. 


చీపురుపల్లి మండలం రావివలసలోని ఈ సంపద తయారీ కేంద్రం అయిదేళ్లూ నిరుపయోగంగా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం, ఇతర వనరుల ద్వారా రూ.28,50,657 నిధులు సమకూరాయి. అభివృద్ధి మాత్రం చేయలేదు. 2014-19 మధ్య తెదేపా హయాంలో రూ.5 లక్షలతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. హరిత రాయబారులకు వేతనాలు చెల్లించలేదు. 2020-21లో జమైన ఆర్థిక సంఘం నిధులు రూ.3.82 లక్షలు విద్యుత్తు ఛార్జీల కింద తీసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని