logo

డిగ్రీ కళాశాలల్లో క్రీడల్లేవ్‌

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు వ్యాయామ విద్య ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Published : 01 Jul 2024 05:25 IST

మైదానాలు, పీడీ పోస్టుల కొరత
విద్యార్థులకు వ్యాయామ విద్య దూరం

చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 830 మంది విద్యార్థులు ఉన్నారు. క్రీడామైదానం లేకపోవడంతో సహాయ వ్యాయామ ఉపాధ్యాయిని ఉన్నా క్రీడా సాధన కరవు 

న్యూస్‌టుడే, చీపురుపల్లి: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు వ్యాయామ విద్య ఆవశ్యకత ఎంతైనా ఉంది. డిగ్రీ స్థాయిలో క్రీడల్లో సాధన చేసి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుని ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఆర్మీ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా మైదానాలు అందుబాటులో లేక విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా సాధన లేక రాణించలేని దుస్థితి నెలకొంది. 

జిల్లాలో చీపురుపల్లి, ఎస్‌.కోట, విజయనగరం, రాజాం, గజపతినగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. చీపురుపల్లి, ఎస్‌.కోట కళాశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా కళాశాలల్లో భవనాల నిర్మాణం జరగకపోవడంతో క్రీడామైదానాలు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాలేదు. దీంతో క్రీడల్లో ఆసక్తి ఉన్నా సాధనకు అవకాశం లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యం మరుగున పడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యాయామ ఉపాధ్యాయులు లేని చోట్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికపై నియమిస్తే సాధనకు అవకాశం ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

ఒక్కోచోట ఒక్కో సమస్య

  • చీపురుపల్లి-గరివిడి పట్టణాల మధ్య విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశాలమైన ఖాళీ స్థలం ఉన్నా ఇంతవరకు క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసి, సాధన చేసేందుకు సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడ అసిస్టెంట్‌ పీడీ ఉన్నా శిక్షణకు అంతగా అవకాశం లేకుండా పోయింది. 
  • విజయనగరం డిగ్రీ కళాశాలలో కొద్ది రోజుల కిందట పీడీ పోస్టు భర్తీ అయింది. సొంత భవనాలు లేక సంస్కృత కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు ప్రత్యేకంగా మైదానం అందుబాటులో లేక క్రీడాశిక్షణకు అవకాశం లేకుండా పోయింది. 
  • గజపతినగరంలో ఇటీవల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టు మంజూరైనా భర్తీ కాలేదు. రాజాం కళాశాలకు పీడీ పోస్టు మంజూరు కాలేదు. ఈ రెండు చోట్ల ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాలు నిర్మాణం కాక జూనియర్‌ కళాశాలల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. 
  • ఎస్‌.కోటలో పోస్టులు మంజూరైనా ఖాళీగా ఉండడంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు.

క్రీడాశిక్షణకు చర్యలు చేపడతాం

చీపురుపల్లి కళాశాలలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడున్న అసిస్టెంట్‌ పీడీ పోస్టును ఉన్నతీకరించాలని ఉన్నతాధికారులను కోరాం. రాజాంలో పోస్టు మంజూరుకు కృషి చేస్తాం. పోస్టులు ఖాళీగా ఉన్న చోట్ల భర్తీకి చర్యలు చేపడతాం.

డాక్టర్‌ పీవీ కృష్ణాజీ, ప్రధానాచార్యుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చీపురుపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని