logo

విద్యాసంస్థల్లో వ్యాపారానికి ముకుతాడు

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక వ్యాపారానికి కొత్త ప్రభుత్వం ముకుతాడు వేసింది. వీరి దోపిడీకి తెరదించుతూ కొరడా ఝుళిపిస్తోంది.

Updated : 01 Jul 2024 06:05 IST

పుస్తకాలు, ఏకరూప దుస్తులు అమ్మితే చర్యలే 

బొబ్బిలిలో ఓ ప్రైవేటు పాఠశాలలో  ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన మేరకు అధికారులు సీజ్‌ చేసిన పాఠ్యపుస్తకాలు 

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక వ్యాపారానికి కొత్త ప్రభుత్వం ముకుతాడు వేసింది. వీరి దోపిడీకి తెరదించుతూ కొరడా ఝుళిపిస్తోంది. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు తప్ప ఇతరత్రా అమ్మకూడదు. కళాశాలల్లో పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు విక్రయించకూడదని స్పష్టం చేసింది. విద్యార్థులు బహిరంగ మార్కెట్లో  వీటిని కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డులు ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు విద్యాసంస్థలకు సూచిస్తున్నారు. 

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలలు 537, కళాశాలలు 140 ఉన్నాయి. గడిచిన విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో 1.30 లక్షల మంది, ఇంటర్మీడియట్‌లో మరో 43 వేల మంది ప్రవేశాలు పొందినట్లు గణాంకాల బట్టి తెలుస్తోంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పాఠ్య పుస్తకాలు విద్యాసంస్థలకు ఓ వ్యాపారంగా మారింది. వారు చెప్పిందే ధర.. బయట కొందామన్నా కుదరదు.. అక్కడే కొనాలి. తల్లిదండ్రులు ఆయా సంస్థలపై ఉండే మోజుతో  తప్పదన్నట్లు సిద్ధపడుతున్నారు. ఇదే అదనుగా ఆయా విద్యాసంస్థలు ఏటా 5-10 శాతం ధరలు పెంచుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. అవసరం లేని పుస్తకాలను సైతం అంటగడుతూ రూ.వేలల్లో తీసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యాపారం తారాస్థాయికి చేరింది. వీటిపై విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు, ఆందోళనలూ చేస్తున్నా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. మండలస్థాయిలో ఎంఈవోలు పాఠశాలలకు కొమ్ము కాస్తుండడంతో వీరి వ్యాపారం ఇష్టారాజ్యంగా మారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయ.

విద్యాసంవత్సరం చివర్లోనే..

ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటికే ప్రవేశాలు తుదిదశకు చేరుకున్నాయి. పాఠశాలలు ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యాయి. కళాశాలలు జూన్‌ 1 నుంచి తెరచుకున్నాయి. పాఠశాలల్లో విద్యాసంవత్సరం చివర్లోనే పుస్తకాలు కొనుగోలు చేసేలా విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల స్థాయిలో పాఠ్యపుస్తకాలు మినహా నోటుపుస్తకాలు, ప్రత్యేక పుస్తకాల పేరుతో రూ. వేలల్లో తీసుకుంటున్నారు. ఈ ఏడాది నగరంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాల ఎల్‌కేజీ విద్యార్థి పుస్తకాలకు రూ.3,641 వసూలు చేస్తోంది. పదో తరగతికి రెండు విభాగాలుగా రూ.11,700 వసూలు చేశారు. అదే గ్రామీణంలో కాస్త తక్కువ ఉంటోంది. పాఠ్యపుస్తకాలకు ఇవి అదనం. వీటిని కొందరు తెచ్చి పాఠశాలల్లో అమ్ముతుండగా, కొన్ని చోట్ల బయట కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. 

ఐదు శాతం రుసుము

ప్రభుత్వానికి ఐదు శాతం రుసుము చెల్లించి నిర్దేశించిన విక్రయశాలల్లో కొనుగోలు చేసిన పుస్తకాలే అమ్ముకోవాలి. మరే ఇతర పుస్తకాలు అమ్మరాదు. వేరేవి విక్రయిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఎన్‌.ప్రేమకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి

పుస్తకాలు, దుస్తులు అమ్మకూడదు

కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అమ్మరాదు. తనిఖీల్లో అమ్మినట్లు తేలితే కళాశాలలపై చర్యలు తప్పవు. విద్యార్థులు బయటే కొనుగోలు చేసుకోవాలి. 

ఎం.ఆదినారాయణ, డి.మంజుల వీణ, ఉమ్మడి జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు, ఇంటర్మీడియట్‌ బోర్డు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని