logo

రైతులు కోరిన విత్తనాలే ఇస్తాం

ఖరీఫ్‌ సీజన్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌ తెలిపారు.

Published : 29 Jun 2024 03:55 IST

జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌

ఖరీఫ్‌ సీజన్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌ తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. అధిక దిగుబడులు సాధించేలా రైతులను సన్నద్ధం చేస్తున్నట్లు ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వెల్లడించారు. ఈ ఖరీఫ్‌లో సన్నద్ధత వివరాలు ఆయన మాటల్లో..

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

 1.78 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఖరీఫ్‌లో 1.78 లక్షల ఎకరాల్లో వరి వేసేందుకు అనుకూలంగా ఉంది. ఈ ఏడాది 32,439 మంది రైతులకు కోరిన వరి విత్తనాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 19,108 క్వింటాళ్లు అందజేశాం. 1064, 1121, ఆర్‌జీఎల్‌2537 (శ్రీకాకుళం సన్నాలు), సోనామసూరి 3291, ఇంద్ర 1061, స్వర్ణ 7029, సాంబమసూరి 5204, తెలంగాణ సన్నాలు 15048, ఎన్‌ఎల్‌ఆర్‌ 4001, నెల్లూరు మసూరి 34449, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, ఎంటీయు 1318 రకాలను అందుబాటులో ఉంచాం. 25,324 క్వింటాళ్ల (అపరాలు, చోడి, వేరుశనగ, వరి) విత్తనాలు 90 శాతం రాయితీపై గిరిజనులకు అందించేలా ఆర్బీకేల్లో సిద్ధం చేశాం.

11 మందికి డ్రోన్‌ శిక్షణ

జిల్లాలో ఆధునిక వ్యవసాయ విధానం అభివృద్ధి చేసేందుకు 11 మందికి డ్రోన్‌ శిక్షణ ఇప్పించాం. పెద్ద పరిమాణంలో ఉన్న డ్రోన్లు తెప్పించే క్రమంలో కొంత జాప్యం జరిగింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు గతంలో రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేవారు. కొన్నాళ్లుగా అవి మంజూరు కాలేదు. డిమాండు మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం.  

42 వేల టన్నుల ఎరువులు

ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం. 45,277 టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా గత నెల నుంచే ఆర్బీకేలకు తరలిస్తున్నాం. మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో అన్ని రకాల ఎరువులు నిల్వ చేశాం. ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 19,549 టన్నులు పంపిణీ చేపట్టాం. ప్రస్తుతం మరో 15,466 టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.  

భూసార పరీక్షలు 

ఖరీఫ్‌ సాగు సన్నద్ధతపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సాగు పద్ధతులు, అధిక దిగుబడి సాధించే విధానాలు, చీడపీడల నిర్మూలన, ఎరువులు, యంత్రాల వినియోగం, ప్రభుత్వ రాయితీ పథకాల గురించి రైతులకు తెలియజేస్తున్నాం. రైతులకు మేలు చేసేలా భూసార పరీక్షలు చేస్తున్నాం. 2024-25 ఏడాదికి సంబంధించి 12,800 నమూనాలు పరీక్షించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,407 నమూనాలు విశాఖ ల్యాబ్‌కు పంపించాం.  

నకిలీలకు ముకుతాడు

నకిలీ విత్తనాలతో ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఆలోచనతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. విత్తన పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2024-25 ఏడాదికి సంబంధించి అగ్రిల్యాబ్‌ల్లో విత్తన నాణ్యత పరీక్షలు చేస్తున్నాం. ఆర్బీకేల ద్వారా 205 శాంపిళ్లు పరీక్షించాం. ఇతర ప్రాంతాల నుంచి 29, రైతుల నుంచి 14 శాంపిళ్లు అందాయి. వాటిని పరీక్షించాల్సి ఉంది.

ఆకుమడులు సిద్ధం

ప్రస్తుతం పడుతున్న వర్షాలు ఖరీఫ్‌ సీజన్‌కు ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటికే పాచిపెంట, సాలూరు, పార్వతీపురం, భామిని తదితర మండలాల్లో ఆకుమడులు సిద్ధం చేశారు. భూమిలో వేడి ఎక్కువగా ఉన్నందున మొలకలు రావడం లేదు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సిద్ధం అవుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని