logo

ఎంఎస్‌ఎంఈ పార్కుకు అడుగులు

ఎన్నాళ్ల నుంచో శృంగవరపుకోట ప్రాంతంలో అదిగో ఇదిగో జిందాల్‌ పరిశ్రమ ఏర్పాటవుతుందని ఊరిస్తున్నారు.

Published : 29 Jun 2024 03:59 IST

న్యూస్‌టుడే, శృంగవరపుకోట

జిందాల్‌ భూములు 

ఎన్నాళ్ల నుంచో శృంగవరపుకోట ప్రాంతంలో అదిగో ఇదిగో జిందాల్‌ పరిశ్రమ ఏర్పాటవుతుందని ఊరిస్తున్నారు. బొడ్డవర ప్రాంతంలో ఆ సంస్థ సేకరించిన 1166.43 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పట్టుదలతో ఉన్నారు. ఇటీవల వారిని యాజమాన్య ప్రతినిధులు కలవగా పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. ఇప్పటికే దీని ప్రతిపాదనలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై మంత్రి లోకేశ్‌ను ఆ సంస్థ డైరెక్టరు రాచూరి కనకారావు కలసి చర్చించారు.

బొడ్డవరలో 2007-08లో అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకొచ్చింది. అప్పట్లో అసైన్డు భూములు 834.66 ఎకరాలు, ప్రభుత్వ భూములు 151.04 ఎకరాలు ప్రభుత్వం కేటాయించగా మరో 180.73 ఎకరాల జిరాయితీ భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అనంతగిరి కొండల్లో బాక్సైట్‌ ఖనిజ తవ్వకాలకు అభ్యంతరాలతో అల్యూమినా కర్మాగారం ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి భూములు ఖాళీగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం భూ నిర్వాసితులకు ప్రతి నెలా కనీస వేతనం సంస్థ అందిస్తోంది. ప్రస్తుతం రూ.10,900 చెల్లిస్తోంది.

రూ.400 కోట్లు

భూసేకరణతో పాటు పునరావాస ప్యాకేజీ, అల్యూమినా కర్మాగారం డీపీఆర్, ఇతర కార్యాచరణ పనులకు రూ.400 కోట్ల మేర జేఎస్‌డబ్ల్యూ సంస్థ వెచ్చించింది. ఖాళీగా భూములు ఉండిపోవడంతో ఎంఎస్‌ఎంఈ, ఇతర అనుకూల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ గతేడాది ఫిబ్రవరి 20న జీవో జారీ అయింది. ప్రస్తుత ప్రభుత్వం ముందుకు రావడంతో పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

అనుకూలతలు ఇవి

  • బొడ్డవర ప్రాంతం నుంచి 70 కి.మీ. దూరంలో విశాఖ పోర్టు ఉంది.
  • పక్క నుంచే విశాఖ-కొత్తవలస-కిరండోలు రైలు మార్గం వెళుతోంది.
  • విద్యుత్తు సౌకర్యానికి ఉప కేంద్రం, నీటి అవసరాలకు తాటిపూడి జలాశయం అందుబాటులో ఉన్నాయి.
  • రాయపూర్‌-విశాఖ పోర్టు గ్రీన్‌ఫీల్డు ఎక్స్‌ప్రెస్‌ హైవే 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • విజయనగరం నుంచి బౌడారా, పెందుర్తి నుంచి బొడ్డవర వరకు జాతీయ రహదారి ఉంది.

పెట్టుబడులు.. రూ.4 వేల కోట్లు

ఎంఎస్‌ఎంఈ పార్కులో రూ.4 వేల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని జేఎస్‌డబ్ల్యూ సంస్థ అంచనా వేసింది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తోంది. పరిశ్రమల పార్కు కార్యరూపం దాలిస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

సానుకూలంగా స్పందించారు: ఎంఎస్‌ఎంఈ ఏర్పాటు గురించి ఐటీ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లాం. ఈ ప్రతిపాదనల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అన్ని అనుకూలిస్తే వెంటనే పార్కు నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం.

రాచూరి కనకారావు, డైరెక్టర్, జిందాల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు లిమిటెడ్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని