logo

అధికార అండ.. కరిగింది కొండ

ఒక వైపు సముద్ర తీరం.. మరోవైపు కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలు.. వాటి చుట్టూ అందమైన పచ్చని కొండలు.. పిల్లగాలులతో ఆహ్లాదకర వాతావరణం.

Updated : 29 Jun 2024 04:57 IST

వైకాపా హయాంలో కబ్జాపర్వం

పురికొండ ఆక్రమిత స్థలంలో కొబ్బరి మొక్కలు

ఒక వైపు సముద్ర తీరం.. మరోవైపు కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలు.. వాటి చుట్టూ అందమైన పచ్చని కొండలు.. పిల్లగాలులతో ఆహ్లాదకర వాతావరణం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జాతీయ రహదారిని ఆనుకొని తీరం వైపు సుమారు పది పన్నెండు కిలోమీటర్లు వెళ్తే మరో కోనసీమను తలపిస్తోంది. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఆ అందాల గిరులపై వైకాపా నేతల కన్నుపడింది. అధికార అండతో కొండలను ఆక్రమించుకున్నారు. తొలుత కొండల దిగువ ప్రాంతం నుంచి పైకి తవ్వుకుంటూ చదును చేశారు. కొందరు దర్జాగా కొబ్బరి మొక్కలు నాటారు. మరికొందరు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా అక్రమార్కుల చేతిలో కొండలు కరిగిపోతున్నా ఇటు రెవెన్యూ అధికారులు గానీ, అటు అటవీ శాఖ అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం  పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే- పూసపాటిరేగ

‘పురి’విప్పిన ఆక్రమణలు

పూసపాటిరేగ మండలం చౌడువాడ పంచాయతీ కోనాయిపాలెం సర్వే నం.17లో 31.48 ఎకరాల్లో పురికొండ విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీర ప్రాంతం కనిపిస్తుంది. తమ పార్టీ అధికారంలో ఉండగా వైకాపా నాయకులు కొండ చుట్టూ కొంత చదును చేశారు. తొలుత ఒకరు నాలుగైదు ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగాయి. వాటికి బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. అతనిని చూసి నలుగురైదుగురు కొండను దొలిచేసి కొబ్బరి మొక్కలు నాటారు. మరికొందరు నాటేందుకు భూమిని చదును చేసి సిద్ధం చేశారు. మొత్తం 10 ఎకరాల వరకు ఆక్రమించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా కొబ్బరి తోట సుమారు రూ.కోటి ధర పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.10 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు.

 చదును చేసిన చౌడువాడ కొండ

ఒకరిని చూసి ఒకరు..

చౌడువాడ గ్రామాన్ని ఆనుకొని  ఉన్న పెద్దకొండ (చౌడువాడ కొండ) సర్వే నం.153లో 68.55 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఓ విశ్రాంత ఉద్యోగి ఒకరికి ప్రభుత్వం మూడెకరాలు ఇవ్వగా ఆ భూమిని మరొకరికి విక్రయించారు. ఆయన నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేశారు. ఇలా చేతులు మారిన తర్వాత మూడో వ్యక్తి చేతికి అందిన భూమిని ఆనుకొని మరో మూడెకరాలు కలుపుకొని మొత్తం   ఆరు ఎకరాల్లో కొబ్బరి మొక్కలు పెంచుతున్నారు. వీరెవరూ స్థానికులు కాదు. అనధికారిక లావాదేవీలు జరిగాయి. చివరి వ్యక్తి కొబ్బరి మొక్కలు నాటి వెళ్లిపోయారు. వాటిని అప్పుడప్పుడూ చూసి వెళ్తుంటారని స్థానికులు తెలిపారు. ఈ కొండపై మొత్తం 12 ఎకరాలకు పైగా ఆక్రమించారు. ఇక్కడ ఎకరా ధర రూ.60 లక్షల వరకు ఉంది. మరో రెండు, మూడేళ్లు ఇలాగే వదిలేస్తే ఈ కొండ మచ్చుకైనా కనిపించకుండా చేసేస్తారని స్థానికులు చెబుతున్నారు.

పక్కా గృహాల నిర్మాణం

కొందరు కొండల చుట్టూ పక్కా భవంతులు, వాటి చుట్టూ ప్రహరీలు కట్టుకున్నారు. ఆపై కొందరు ఎకరాల్లో.. మరికొందరు ఎకరా, అరెకరా, ఇరవై సెంట్ల భూమిని మొక్కలు వేసేందుకు ప్రస్తుతం చదును చేసుకుంటున్నారు. అధికారులు రారు.. అడిగేవారు లేరని రోజురోజుకూ కొండను దొలిచేస్తున్నారు. కొందరు కంకర మట్టి తవ్వడం, దాన్ని తరలించడం, ఆ తర్వాత చదును చేసి హద్దులు నిర్ణయించుకుంటున్నారు.

గతంలో స్పందించి.. తర్వాత వదిలేసి..

చౌడువాడ పంచాయతీ పరిధిలోని సుమారు వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న కొండలు ఆక్రమించుకుంటున్నారని అందిన సమాచారంతో గతంలో రెవెన్యూ అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములంటూ బోర్డులు పాతారు. ఆపై అప్పటి అధికార వైకాపా నాయకుల ప్రమేయం ఉండటంతో మాకెందుకీ తలనొప్పి అని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు సైతం మూడు, నాలుగు నెలలకే వచ్చాం.. మళ్లీ వెనక్కి వెళ్లిపోతామని ఇలాంటి ఆక్రమణలు మండలంలో కోకొల్లలుగా ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం: ప్రభుత్వ భూములు, కొండలు, పోరంబోకు  భూములు ఎవరు ఆక్రమించుకున్నా చర్యలు తీసుకుంటాం. యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతాం. మండల అధికారులతో మాట్లాడి నివేదిక కోరతాం.    

 సూర్యకళ, ఆర్డీవో, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని