logo

ప్రాజెక్టులకు భూసేకరణ

జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆదేశించారు.

Published : 29 Jun 2024 03:33 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సాగునీటి ప్రాజెక్టులు, భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వేలైన్ల పనులపై సమీక్షించారు. నిధులు లేకపోవడంతో కొన్నిచోట్ల భూసేకరణ ఆగిపోయిందని నీటి పారుదల శాఖ అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. మంజూరు చేయాలని కోరుతూ సంబంధిత కార్యదర్శికి లేఖ రాస్తానని కలెక్టర్‌ చెప్పారు. కొన్నిచోట్ల భూసమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పగా, రైతులతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలని జేసీ కార్తీక్, ఆర్డీవో శశికళను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం రన్‌వే, అప్రోచ్‌ రోడ్డు పనులు పురోభివృద్ధిలో ఉన్నాయని, ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యల్లేవని ఆర్డీవో వివరించారు. రైల్వేకు అవసరమైన భూమిని సేకరించి, చెల్లింపుల కోసం నిధులు కోరుతూ ఉన్నతాధికారులు లేఖలు రాయాలని కలెక్టర్‌ తెలిపారు. పెదమానాపురం, పురిటిపెంట, కోమటిపల్లి తదితర గ్రామాల వద్ద భూములు అవసరమని రైల్వే అధికారులు ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్‌.డి.అనిత, ఉప కలెక్టర్లు ప్రమీల, మురళీ, జోసెఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని