logo

రాజుల కోటా వైకాపా కార్యాలయమా!

అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికకు ఏ అనుమతులు లేవంటూ సీఎంగా అధికారం చేపట్టిన క్షణాల్లో కూల్చివేయించాడు జగన్‌. అలాంటి వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాకో రాజదర్బార్‌  లాంటి వైకాపా కార్యాలయాలను నిర్మించాడు.

Published : 26 Jun 2024 04:39 IST

స్థలం కేటాయింపులో అక్రమాలు
ఆపై అనుమతి లేకుండా నిర్మాణాలు

విజయనగరంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం

అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికకు ఏ అనుమతులు లేవంటూ సీఎంగా అధికారం చేపట్టిన క్షణాల్లో కూల్చివేయించాడు జగన్‌. అలాంటి వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాకో రాజదర్బార్‌  లాంటి వైకాపా కార్యాలయాలను నిర్మించాడు. విజయనగరంలో రాజుల కోట నమూనాలో ఆకృతిని రూపొందించారు. తమకు సన్నిహితంగా ఉండే సంస్థ యజమానికి ఈ భవన నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో అడ్డగోలుగా స్థలం కేటాయింపు జరుపుకొన్నారు. అనుమతులు తీసుకోకుండా భవన నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా.. అనుమతి లేని నిర్మాణాలు నేలమట్టం చేయాల్సిందే.. అని బీరాలు పలికిన జగన్‌మోహన్‌రెడ్డి, అనుమతి లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఏమి చేయమంటారని జిల్లా ప్రజలు  ప్రశ్నిస్తున్నారు. 

ఈనాడు, విజయనగరం: అధికారం అండగా ఉంటే అడిగేవారెవరనే ధోరణిలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పలు అక్రమాలకు తెరలేపారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. మేము చెప్పింది చేస్తే మీకు అన్ని విధాలా అండగా ఉంటామని అధికారులకు భరోసా ఇచ్చారు. దీంతో కింది స్థాయి ఉద్యోగి నుంచి కలెక్టర్‌ వరకు అందరూ జీహుజూర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో వైకాపా కార్యాలయానికి భూమిని కేటాయిస్తూ జీవో నం.350 జారీ చేశారు. ఆపై అనువైన స్థలం కోసం ఆ పార్టీ నాయకులు నగరంలో జల్లెడపట్టి నగరపాలక సంస్థ పరిధిలోని మహారాజుపేట సౌత్‌ వార్డు టీఎస్‌ నం.569-పిలోని భూమిపై కన్నేశారు. రింగ్‌రోడ్డు సమీపంలో రహదారి పక్కన ఉన్న ఈ విశాలమైన భూమిని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 2022లో కలెక్టర్‌గా పనిచేస్తున్న సూర్యకుమారి కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. మండల తహసీల్దారు ప్రభాకరరావుతో ముందస్తుగా వైకాపా నాయకులు మాట్లాడి ఎంపిక చేసిన స్థలాన్ని పొందారు. ఇది వాస్తవంగా రాజా వారి భూమి. అధికార పార్టీ అగ్ర నాయకులు, మరో వైపు జిల్లా కలెక్టర్‌ సూచించడంతో దాన్ని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో చూపినట్లు తెలిసింది. సుమారు ఎకరా కేటాయించారు. దీనికి ఏడాదికి రూ.వెయ్యి చెల్లించేలా 33 ఏళ్లకు లీజు మంజూరు చేశారు. ఆ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి నగరపాలక సంస్థకు లేఖ రాశారు. అభ్యంతరం లేదని 2022 ఏప్రిల్‌ 12న కౌన్సిల్‌ ఆమోదించింది. భవన నిర్మాణానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ స్థలంలో శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి, ఈపీడీసీఎల్‌ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణానికి గతంలో ప్రతిపాదించారు. వాటికి కేటాయిస్తామంటూనే వైకాపా కార్యాలయానికి ఉన్నతాధికారులు కట్టబెట్టడం  గమనార్హం.

భవనం లోపల జరుగుతున్న పనులు

ధర్నా చేసినా పట్టించుకోలేదు 

నగరంలో వైకాపా కార్యాలయానికి 2022లో ఈ స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించినప్పుడే దీనికి వ్యతిరేకంగా తెదేపా ధర్నా చేపట్టింది. విలువైన స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని డిమాండ్‌ చేసింది. ఈ భూమి విజయనగరం మహారాజులకు చెందిందని, ప్రభుత్వం రాజకీయ పార్టీకి ఎలా కేటాయిస్తుందని తెదేపా నాయకులు ప్రశ్నించారు. దీనికి అప్పటి జిల్లా అధికారులు మౌనం దాల్చారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన అధికారుల తీరుపై తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. రికార్డులు తారుమారు చేసి దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా అధికారిక సమాచారం తీసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. 

ఆ ఒక్కటీ చాలదు 

వైకాపా కార్యాలయం నిర్మిస్తున్న భూమి ప్రభుత్వ మార్కెÆట్‌ విలువ ప్రకారం గజం ధర రూ.6,300 ఉంది. బహిరంగ మార్కెÆట్‌లో రూ.30 వేలు ధర పలుకుతోంది. రూ.కోట్ల విలువైన భూమిని ఏటా రూ.వెయ్యి చెల్లించేలా 33 ఏళ్లకు ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. రాజుల కోట నమూనాలోనే రెండస్తుల భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. సుమారు 4,800 చదరపు గజాల స్థలంలో ఆధునిక హంగులతో, పది పన్నెండు గదులతో రుషికొండ ప్యాలెస్‌కు తీసిపోని విధంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఫ్లోరింగ్, తలుపులు వంటి పనులు చేపట్టాలి. చివరి దశకు నిర్మాణం చేరుకున్నా.. అధికారికంగా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. సుమారు ఎకరా స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులిచ్చే అధికారం నగర పాలక సంస్థకు లేదు. దీంతో విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో గతేడాది జులైలో ప్లాన్‌ అనుమతికి దరఖాస్తు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ జారీ చేసిన ఎన్‌వోసీ తప్ప, ఇతర అనుమతులు, సంబంధిత సంస్థల ఎన్‌వోసీలు లేవని, ఆ ఒక్కటే చాలదని, మరికొన్ని ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని, అవి లేకుండా ఇవ్వలేమని కొర్రీలు వేసి ఆ దస్త్రాన్ని వెనక్కి పంపించారు. తాజాగా ఈ లోపాలను గుర్తించిన విజయనగరం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు వారం రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని నోటీసులు జారీ చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని