logo

గాల్లో తేలాలా.. నదిలో మునగాలా

బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై కుంగిన వంతెన స్థానంలో కొత్త నిర్మాణానికి ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Published : 26 Jun 2024 04:29 IST

చిన్నపాటి    వర్షానికి కొట్టుకు పోయిన కాజ్‌వేకు మళ్లీ మరమ్మతులు 
పరిశ్రమల నుంచి వసూలు చేసిన నిధుల మాటేమిటి?
 

పూర్తిగా కొట్టుకుపోయిన రహదారిని ఎలా బాగు చేస్తారు

జిల్లాలో కీలకమైన పారాది వంతెన విషయంలో గత ఐదేళ్లుగా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వారధి కుంగిన నేపథ్యంలో ఉద్ధృతంగా ప్రవహించే వేగావతి నదిలో చిన్న కాజ్‌వేను వేసి.. చేతులు దులుపుకొన్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే అదీ కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ దాన్నే బాగు చేసేందుకు ర.భ.శాఖ అధికారులు పనులు చేపట్టారు. దీనిపై తారురోడ్డు వేసినా ఏ మేరకు ఉంటుందన్నది ప్రశ్న. భారీ వర్షాలకు అదీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

 

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై కుంగిన వంతెన స్థానంలో కొత్త నిర్మాణానికి ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాత వంతెన ప్రారంభంలో ఓ మూలన కుంగింది. అప్పట్లో దీని కింద గడ్డర్లు ఉంచారు. అక్కడ ఉన్న స్లాబ్‌ తొలగించి, కొత్తగా నిర్మిస్తే సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుందని నిపుణులు చెప్పుకొచ్చారు. అదీ తక్కువ ఖర్చుతో అవుతుందని అంటున్నారు. అయినా ఇంత వరకు ఆ పనుల జోలికి వెళ్లలేదు. ఇటీవల బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన దీనిపై నిపుణుల సూచనలు తీసుకున్నారు. బొబ్బిలి వచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లారు. అయితే ర.భ.శాఖ అధికారులు వంతెన నిర్మాణం ప్రారంభించకుండా కాజ్‌వే పనులకు మళ్లీ తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. 

పాత వంతెన కుంగిన ప్రాంతం 

సీతానగరం అనుభవం కాదా?

ఇదే మార్గం పరిధిలో సీతానగరం మండలం సువర్ణముఖి నదిపై ఇలాంటి పురాతన వంతెనే కుంగిపోయింది. అప్పట్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే వంతెనకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారు. మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు చెక్కు చెదరలేదు. భారీ వాహనాలు సైతం దీని మీదుగానే వెళ్తున్నాయి. మరీ ర.భ.శాఖ అధికారులు అక్కడిలా ఇక్కడ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలియడం లేదు. పారాది, సీతానగరం, సాలూరు మండలం కొట్టక్కి వద్ద పూర్వం ఒకేసారి వంతెనల నిర్మాణం జరిగింది. కొట్టక్కి వద్ద కొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. సీతానగరం వద్ద నూతన నిర్మాణ పనులు సాగుతున్నాయి. బొబ్బిలిలో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు.

ఆ మొత్తాలు ఏమయ్యాయో ?

వైకాపా హయాంలో కాజ్‌వే నిర్మాణానికి బొబ్బిలి పారిశ్రామికవాడలోని పరిశ్రమల యజమానుల నుంచి రూ.లక్షల నిధులు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో పరిశ్రమ నుంచి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిసింది. పరిశ్రమలకు విశాఖ పోర్టు నుంచి ముడి సరకు రావాల్సి ఉంది. అలాగే తయారైన ఉత్పత్తులు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి కావాల్సి ఉంది. రాకపోకలు ఇతర మార్గాల్లో మళ్లించడంతో రవాణా ఖర్చులు భారంగా మారాయి. ఉదాహరణకు బొబ్బిలి పారిశ్రామికవాడకు వచ్చే లారీలు రణస్థలం, చిలకపాలెం మీదుగా కొన్ని, ఆకులకట్ట, తెర్లాం మీదుగా మళ్లించారు. దీని వల్ల సుమారు 40 కి.మీల దూరం పెరిగి, ఒక్కో పరిశ్రమకు నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల అదనపు భారం పడుతుంది. దీనివల్ల అప్పట్లో అధికార పార్టీ నేతలు చెప్పిన దానికి పరిశ్రమల యజమానులు తలలు ఊపి, అడిగిన మొత్తాలు సమర్పించారు. ఇదిలా ఉండగా రూ.94 లక్షల వరకు కొత్త వంతెనకు కేటాయించిన నిధుల్లో కాజ్‌వేకు ఖర్చు చేశామని మరోవైపు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు పరిశ్రమల వారిచ్చిన నిధులు ఏమయ్యాయో మరి.

గుత్తేదారుతో పనులు చేయించాం... వేగావతిపై పారాది వద్ద వంతెన నిర్మాణానికి  సుమారు రూ.10.50 కోట్ల నిధులతో టెండర్లు పిలిచారు. సకాలంలో గుత్తేదారు పనులు చేపట్టడం లేదు. ఇంతలో వంతెన కుంగిపోయింది. ప్రత్యామ్నాయంగా సుమారు రూ.94 లక్షలతో కాజ్‌వే నిర్మించాం. గుత్తేదారే భరించారు. పరిశ్రమల యజమానుల నుంచి ఎలాంటి నిధులు మాకు అందలేదు. కాజ్‌వే మరమ్మతులు మళ్లీ గుత్తేదారుతో చేయిస్తున్నాం. కొత్త వంతెన పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. 

జనార్దనరావు, డీఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు