logo

నిధులివ్వకుండా .. ఆడిట్టా?

గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహిస్తున్నట్లు శాఖావర్గాలు పేర్కొంటున్నాయి.

Published : 26 Jun 2024 04:12 IST

ఆడిట్‌ నిర్వహిస్తున్న సభ్యులు

ఉమ్మడి జిల్లాలో పాఠశాలలకు కాంపోజిట్‌ నిధులు ఇవ్వకుండా ఆడిట్‌ నిర్వహించడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఆడిట్‌ నిమిత్తం జిల్లా కేంద్రాల్లో మండల వనరుల కేంద్రానికి రావాల్సి వస్తోంది. మంగళవారం విజయనగరం ఎమ్మార్సీలో గంట్యాడ, డెంకాడ, ఎస్‌.కోట, ఎల్‌.కోట, గజపతినగరం మండలాల్లోని పాఠశాలలకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించారు. 

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహిస్తున్నట్లు శాఖావర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయులు తీసుకొస్తున్న నగదు పుస్తకం, బ్యాంకు స్టేట్‌మెంట్, ప్రభుత్వం నిధులపై ఇచ్చిన నమూనాలో జీరో నిల్వలే ఉన్నాయి. ఆడిట్‌ బృందం వాటికి సంబంధించిన ఒక సెట్‌ను తీసుకుని, రెండో సెట్‌పై ఆడిట్‌ చేసినట్లుగా సంతకం చేసి, స్టాంప్‌ వేసి ఇస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీని వల్ల బోధన సమయం వృథా తప్పా ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. 

 గతేడాదిలో నిలిపివేత

ఉమ్మడి జిల్లాలో 2,760  పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో బోధనకు అవసరమైన సామగ్రి, గ్రంథాలయం, ప్రయోగశాల, స్టేషనరీ విద్యుత్తు, పరీక్షల నిర్వహణకు ఏటా సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా విద్యార్థుల సంఖ్యను బట్టి గ్రాంట్లు మంజూరవుతాయి. రూ.10 వేల నుంచి లక్ష రూపాయిల వరకు కేటాయిస్తారు. ఈ నిధులు తెదేపా ప్రభుత్వంలో ఏకకాలంలో విడుదలయ్యేవి. ఆలస్యమైనా ఉపాధ్యాయులు ఖర్చు చేసిన వాటికి బిల్లులు పెట్టుకునేవారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేకపోవడంతో సొంత డబ్బులు పెట్టుకున్నారు. కొందరు అప్పులు చేసి ఖర్చు చేశారు. 2021-22లో రూ.6.94 కోట్లు నిధులు కేటాయించారు. కొన్ని పాఠశాలలకు సాంకేతిక, ఇతరత్రా కారణాలతో నేటికీ నిధులు రాని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. 2022-23లో రూ.7.5 కోట్లకు 32.53 శాతమే నిధులు విడుదలయ్యాయి. 2023-24లో పైసా కూడా రాలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు ఇతర సామగ్రి కొనుగోలుకు జేబులో డబ్బులు పెట్టుకోవాల్సి    వస్తోంది. గడిచిన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులకు విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి. పాఠశాలలకిచ్చే కాంపోజిట్‌ గ్రాంట్లతో గతంలో ఈ బిల్లులు చెల్లించేవారు. గత విద్యా సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా నిలిచిపోవడంతో అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రస్థాయిలో నేరుగా విద్యుత్తు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో కొందరు కట్టని పరిస్థితి ఉంది. సగటున  ప్రాథమిక పాఠశాలకు రూ.500, యూపీకి రూ.1,500, ఉన్నత పాఠశాలలకు రూ.2 వేలు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. నాడు - నేడు పనులతో బడుల్లో ఫ్యాన్లు, ఇంటరాక్టివ్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీల ఏర్పాటుతో వినియోగం గతం కన్నా అధికమైనట్లు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని