logo

వైకాపా సమావేశంలో వర్గపోరు

విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి.

Published : 05 Jul 2024 03:43 IST

ఓటమికి కారణం మీరంటే మీరని దూషణలు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్‌నాథ్‌

మధురవాడ, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి. పార్టీ ఓటమికి కారణం మీరంటే మీరని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పీఎంపాలెం న్యాయ కళాశాల రోడ్డులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన వైఎస్సార్‌ జయంతిని ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు.

  • అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి ప్రజా సమస్యల కోసం పోరాటం చేద్దామని చెబుతున్న సమయంలో గుడివాడ మాటలను కొందరు నాయకులు వ్యతిరేకించారు. పార్టీ అధికారంలో ఉండగా పదవులు పొందిన వారు ఇప్పుడు ఎక్కడంటూ నిలదీశారు. ఛైర్మన్ల పేరుతో పదవులు భుజాన వేసుకుని తిరిగిన వారంతా కష్టకాలంలో కనిపించడం లేదన్నారు. జెండాలు పట్టుకుని తిరిగిన తమకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సముచిత స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • పార్టీ ఓటమి చెందిన దశలో పదవులు అనుభవించిన నాయకులకు తాము ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ స్వయంగా గుడివాడపైనే ఆరోపణలకు దిగారు. దీంతో ఆయన అనుకూల వర్గీయులు తిరగబడడంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. గుడివాడకు ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని, లేదంటే ఊరుకోబోమని కొందరు బహిరంగంగా విలేకరుల ముందే డిమాండ్‌ చేశారు. ఇరు వర్గాలను కొందరు నాయకులు శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విభేదాల నేపథ్యంలో సమావేశాన్ని సగంలోనే ముగించి కార్యాలయంలోని మరో గదిలోకి అమర్‌నాథ్‌ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ జి.హరివెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ సర్పంచి చెన్నాదాసు, నాయకులు సీహెచ్‌.వెంకట్రామయ్య, కె.కె.రాజు, పేడాడ రమణికుమారి, పలు వార్డుల కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని