logo

జలవనరులశాఖ బకాయిలు.. రూ. 389 కోట్లు

ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు రూ.389.12 కోట్ల మేర బకాయిలున్నట్లు ఆశాఖ నార్త్‌ కోస్టల్‌ చీఫ్‌ ఇంజినీరు (సీఈ) ఎస్‌.సుగుణాకరరావు తెలిపారు.

Published : 05 Jul 2024 03:31 IST

ఉత్తరాంధ్ర సీఈ సుగుణాకరరావు

ఈనాడు, విశాఖపట్నం, వన్‌టౌన్‌ న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు రూ.389.12 కోట్ల మేర బకాయిలున్నట్లు ఆశాఖ నార్త్‌ కోస్టల్‌ చీఫ్‌ ఇంజినీరు (సీఈ) ఎస్‌.సుగుణాకరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో నిధులు విడుదల కాకపోవడంతో భారీగానే బకాయిలు పేరుకుపోయాయన్నారు. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు బకాయిల వివరాలపై నివేదికను పంపినట్లు చెప్పారు. గురువారం ఉదయం సీఈ కార్యాలయంలో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే చెల్లింపుల కోసం రూ.112.12 కోట్ల మేర బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్‌ చేశాం. మరో రూ.29.09కోట్ల బిల్లులను సిద్ధం చేశాం. వాటిని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఇంకా రూ.240 కోట్లకు పైగా పనులు పూర్తి చేశాం. వాటి వివరాలు ఎంబుక్‌లో రికార్డులో చేయాల్సి ఉంది.  ఈ సీజన్‌లో ఉత్తరాంధ్రలో మా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 6.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించాం. కాలువల నిర్వహణకు ఈ ఏడాది రూ.20 కోట్లు అవసరం. ఆ మేరకు అంచనాలతో పనుల వివరాలను ప్రతిపాదించాం’ అని వివరించారు.


150 చెల్లిస్తేనే..హాస్టల్లోకి అనుమతి

ఏయూ సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనతో విద్యార్థినులకు అవస్థలు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఉద్యోగులు, సిబ్బంది.. విద్యార్థులను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నారు. గురువారం నుంచి వర్సిటీ తెరుచుకున్న నేపథ్యంలో దూరప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు బుధవారం ఏయూకు చేరుకున్నారు. చివరి ఏడాది చదువుతున్న కొన్ని విభాగాల విద్యార్థినులకు పరీక్షలు పూర్తయ్యాయి. వివిధ పరిశ్రమలు, సంస్థల్లో ప్రాజెక్టు పూర్తిచేసిన తర్వాత నివేదిక సమర్పించేందుకు వారంతా వర్సిటీకి వచ్చారు. కానీ మహిళా వసతి గృహంలోకి వెళ్లకుండా కొందరు సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

గతంలో అదే హాస్టల్‌లో బస చేసినా తమను లోపలకు అనుమతించలేదని విద్యార్థినులు వాపోయారు. సాయంత్రం కావడంతో బయటకు వెళ్లలేమని అభ్యర్థించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ‘మహారాణిపేట ఏయూ లేడీస్‌ హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌’ పేరిట ఉన్న ఫోన్‌పే ఖాతాకు రూ.150 చెల్లించిన తర్వాత లోపలకు అనుమతించారు. గురువారం కూడా కొంత మంది విద్యార్థులను బయట నిలిపివేశారు. సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ ఆదేశాల మేరకు వారిని లోపలకు అనుమతించారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ కిశోర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా చీఫ్‌ వార్డెన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని