logo

మొక్కుబడిగా అల్లూరి జయంతి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పాండ్రంగి గ్రామంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించినా ఈ వేడుకలు గురువారం మొక్కుబడిగా జరిగాయి.

Published : 05 Jul 2024 03:23 IST

సీతారామరాజు విగ్రహం వద్ద గంటా రవితేజ, ఆర్డీవో భాస్కరరెడ్డి, మాజీ మంత్రి ఆర్‌.ఎస్‌.డి.పి.ఎ.ఎన్‌.రాజు తదితరులు

పద్మనాభం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పాండ్రంగి గ్రామంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించినా ఈ వేడుకలు గురువారం మొక్కుబడిగా జరిగాయి. ఎమ్మెల్యే గంటా, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ వస్తారని ప్రకటించినా వారు హాజరు కాలేదు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బదులు ఆయన కుమారుడు గంటా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి ఆర్‌.ఎస్‌.డి.పి.ఎ.ఎన్‌.రాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో రవితేజ మాట్లాడుతూ దేశ నాయకుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

  • ఈ సందర్భంగా విశాఖకు చెందిన ఆర్‌.వి.సత్యనారాయణ అల్లూరి వేషధారణతో, పాండ్రంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఓ గీతానికి నృత్యప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జిల్లా పర్యాటకశాఖాధికారిణి జ్ఞానవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కరరెడ్డి, నాయకులు విజయ్‌బాబు, గాడు వెంకటప్పడు, రామానాయుడు, డి.ఎ.ఎన్‌.రాజు, దామోదరరావు, సర్పంచి పల్లె ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.

మహానుభావా మన్నించు: అల్లూరి జయంతి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడంలో పర్యాటకశాఖ అధికారులు విఫలమయ్యారు. ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం 2014 తరువాత ఇప్పుడే అత్యంత సాధారణంగా చేపట్టారు. 2014లో అప్పటి తెదేపా ప్రభుత్వం అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రకటించింది. దాంతో ఏటా ఈ వేడుకలు ఘనంగా చేపడుతున్నారు. ఈ ఏడాది కనీసం అల్లూరి విగ్రహానికి రంగులైనా వేయలేదు. సభా వేదిక వద్ద తగినన్ని ఏర్పాట్లు జరగక అధికారులు, నాయకులు ఇబ్బందులు పడ్డారు. సభికులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదంటే ఏర్పాట్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక విద్యార్థుల నృత్య ప్రదర్శన తప్ప సాంస్కృతిక కార్యక్రమాల జాడే లేదు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు వెచ్చించిన సొమ్ములో సగం ఈ కార్యక్రమానికి ఖర్చు చేస్తే ఎంతో ఘనంగా జరిగేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకనైనా తగిన శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని