logo

వారిని పంపించేయకుంటే ఉద్యమిస్తాం

ఏయూలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలను వెనక్కి పంపించేయకుంటే తామంతా ఉద్యమం చేపడతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు స్పష్టం చేశారు.

Published : 05 Jul 2024 03:20 IST

ఎయిడెడ్‌ ఫ్యాకల్టీలపై ఏయూ ఆచార్యుల స్పష్టీకరణ

ఏయూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.వి.ఆర్‌. రాజుకు వినతి పత్రం అందిస్తున్న ‘ఆట’ అధ్యక్ష,కార్యదర్శులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఏయూలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల ఫ్యాకల్టీలను వెనక్కి పంపించేయకుంటే తామంతా ఉద్యమం చేపడతామని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ సంఘం(ఆట) అధ్యక్షులు ఆచార్య జాలాది రవి, కార్యదర్శి ఆచార్య పేటేటి ప్రేమానందం ఆధ్వర్యంలో ఆచార్యుల బృందం ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబుతో పాటు వివిధ విభాగాల ప్రిన్సిపల్‌లను కలిసి విజ్ఞాపన పత్రం అందించారు.

  • గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎయిడెడ్‌ కళాశాలలు మూసివేసిన నేపథ్యంలో వాటిలో పనిచేస్తున్న కొందరు ఎయిడెడ్‌ అధ్యాపకులను వివిధ యూనివర్సిటీలు తీసుకున్నాయి. అలా ఆంధ్రవిశ్వవిద్యాలయం కూడా సుమారు 118 మందిని తీసుకుంది. తర్వాత వీరిలో పలువురు వెనక్కి వెళ్లిపోగా 42 మంది మాత్రమే ఏయూలో మిగిలారు. తొలుత వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించేది. ఆ తరువాత ఎయిడెడ్‌ ఫ్యాకల్టీలను వెనక్కు పంపించాలని, లేకుంటే వారి జీత భత్యాలు ఆయా వర్సిటీలే భరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తమకు భారమైనా...జాతీయ స్థాయిలో వివిధ ర్యాంకులు నిలవాలని ఏయూ అధికారులు ఎయిడెడ్‌ ఫ్యాకల్టీలను కొనసాగించారు. మరో వైపు వీరికి సీనియర్‌ ఆచార్యుల కంటే అధిక ప్రాధాన్యం ఇవ్వడం, చీఫ్‌వార్డెన్లు, హెచ్‌.ఒ.డి, డీన్‌ వంటి పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది.
  • డిగ్రీ కళాశాల అధ్యాపకులు వర్సిటీలో బోధనకు తగరన్న విమర్శలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం... తాము చెప్పింది వింటారన్న ఉద్దేశంతో వీరికి ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు వైకాపాకు వీర విధేయ వీసీగా ముద్రపడిన ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మనసెరిగి మసలుకోవడంతో ఎయిడెడ్‌ ఫ్యాకల్టీలు సఫలీకృతులయ్యారని చెబుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం  మారడంతో వీరి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరిని తొలగించాలని గతంలో గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా పనిచేసిన వారు నిరసనలు తెలియజేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని