logo

ఎలాగైనా పాగా వేయాలని..!!

తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్‌గా నియమితులై  పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి.

Published : 05 Jul 2024 03:02 IST

నాడు వైకాపాకు అంటకాగి... ప్రస్తుతం తెదేపా నేతల చెంతకు
ఈపీడీసీఎల్‌లో పట్టుకు తాజా మాజీ డైరెక్టర్‌ వ్యూహాలు

ఈనాడు, విశాఖపట్నం: తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో నిన్న మొన్నటి వరకు ఆయనదే పెత్తనం. వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డైరెక్టర్‌గా నియమితులై  పార్టీ నేతలతో అంటకాగారనే ఆరోపణలున్నాయి. తెదేపా కూటమి సర్కారు వచ్చాక గతంలో నియమితులైన డైరెక్టర్లంతా రాజీనామాలు చేయగా...ఈయనా చేశారు. అయితే...మళ్లీ ఈపీడీసీఎల్‌లో పాగా వేయడానికి తనకు సమీప బంధువైన తెదేపా నేతతో మంతనాలు సాగిస్తున్నారు. గతంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా పనిచేసిన ఈయన పదవీ విరమణకు ఆరు సంవత్సరాల ముందే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. తరువాత డైరెక్టర్‌గా వచ్చేశారు. వైకాపా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చి మౌఖిక పరీక్షల ద్వారా నియమించినా శ్రీకాకుళానికి చెందిన వైకాపా ముఖ్యనేత అండదండలతోనే పదవి వచ్చినట్లు సంబంధితశాఖలో చర్చసాగింది. నాటి నుంచి ఈపీడీసీఎల్‌లో ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఈయనే చక్కబెడుతూ వచ్చారు. తనకంటే పైస్థాయి వారిని మచ్చిక చేసుకొని... దిగువ స్థాయి అధికారులను తన కనుసన్నల్లో పనిచేయించుకునేవారు. గత ప్రభుత్వంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం, వారికి వెంటవెంటనే బిల్లులు అయ్యేలా చూసేవారనే ఆరోపణలున్నాయి. స్మార్ట్‌ మీటర్లు, ఫీడర్ల వర్గీకరణ, భూగర్భ విద్యుత్తు పనులు, జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులకు సంబంధించిన టెండర్లను వైకాపా పెద్దలు చెప్పిన గుత్తేదారు సంస్థలకు దక్కేలా చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. టెండర్లలో పేర్కొన్నవాటికి భిన్నంగా అంచనాలు పెంచి గుత్తేదారులకు బిల్లులు దోచిపెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం మారిన వెంటనే ఈయన తనకు బంధువైన శ్రీకాకుళానికి చెందిన తెదేపా నేత చెంతకు చేరిపోయారు. మరోసారి ఈపీడీసీఎల్‌లో పాగా వేయటానికి  ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని