logo

అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ముందడుగు

అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Published : 05 Jul 2024 02:57 IST

శాసన సభాపతి అయ్యన్న పిలుపు

నందనవనంలో సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్‌ అయ్యన్న, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కలెక్టర్‌ రవి, జేసీ జాహ్నవి తదితరులు

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తి అన్ని తరాలకూ ఆదర్శమని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అల్లూరి 127వ జయంతి వేడుకలు గురువారం కృష్ణదేవిపేటలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్‌ రవి, క్షత్రియ సంఘం నాయకులతో కలిసి స్థానిక నందనవనంలోని సీతారామరాజు సమాధి వద్ద నివాళులర్పించారు. అగ్గిపిడుగు జీవిత చరిత్రకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఏర్పాటు చేసిన చిత్రకళా కేంద్రాన్ని ప్రారంభించారు. అందులోని చిత్రాలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడుతూ సీతారామరాజు పోరాట స్ఫూర్తితో యువత విప్లవ భావాలు, నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపించాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం అల్లూరి స్మారక మందిరాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. నందనవనంలో సమాధుల పైకప్పు పెచ్చులూడిపోయిందని, సందర్శకులకు కనీస వసతులు లేవన్నారు. తక్షణం వీటి మరమ్మతులకు అంచనాలు తయారుచేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ రవి, పర్యటక శాఖ అధికారి మల్లికార్జునరావును ఆదేశించారు. ఎంపీ సీఎం రమేశ్‌ నందనవనం పార్కు అభివృద్ధికి తన నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, అందుకు రెట్టింపు నిధులు రప్పించి ఈ ప్రాంతాన్ని పర్యటకంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.  తొలుత అయ్యన్నపాత్రుడు అతిథులతో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్‌ జాహ్నవి, ఎస్పీ మురళీకృష్ణ, నర్సీపట్నం ఆర్‌డీఓ జయరామ్, గొలుగొండ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్, మండల తెదేపా అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, తెదేపా సీనియర్‌ నాయకులు సాంబమూర్తి, గోపాలకృష్ణ, కొల్లు రాంబాబు, బొడ్డు జమీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని