logo

సముద్ర కాలుష్యం.. మత్స్యరాశులకు శాపం

చేపలవేట సమయంలో మత్స్యకారులు సముద్రంలో పడేస్తున్న వ్యర్థాలు మత్స్యరాశులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.

Published : 04 Jul 2024 02:23 IST

5శాతం మేర దిగుబడి తగ్గే అవకాశం
ఎఫ్‌ఎస్‌ఐ నౌకల సర్వేలో వెల్లడి
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

చేపలవేట సమయంలో మత్స్యకారులు సముద్రంలో పడేస్తున్న వ్యర్థాలు మత్స్యరాశులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) భారతదేశ పరిధిలోని సముద్ర జలాల్లో వ్యర్థాల తీవ్రతపై గ్లోలిట్టర్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ (జీఎల్‌పీ) ప్రాజెక్టు పేరిట అధ్యయనం చేపట్టింది.

విశాఖ కేంద్రంగా ఉన్న ఎఫ్‌ఎస్‌ఐ పరిధిలోని ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంతాల్లో వ్యర్థాల గుర్తింపు, వెలికితీత, మత్స్యరాశులపై వాటి ప్రభావం తదితర అంశాలపై 2021 ఏప్రిల్‌ నుంచి సర్వే ప్రారంభించింది. ఈ ఏడాది జూన్‌ వరకు కొనసాగిన ఈ సర్వేలో ఏకంగా ఎఫ్‌ఎస్‌ఐ సర్వే నౌకలు మత్స్యదర్శిని, మత్స్య  షికారిలకు 4800 కిలోల వ్యర్థాలు లభ్యమయ్యాయి. ఇవి ప్రతి నెలా సముద్ర జలాల్లో సర్వే నిర్వహిస్తాయి. ఇందులో మత్స్యరాశుల స్థితిగతులను అంచనా వేసి ఆయా వివరాలను మత్స్యకారులకు తెలియజేస్తాయి.

370 నాటికల్‌ మైళ్ల దూరంలో సర్వే..

జీఎల్‌పీ ప్రాజెక్టులో భాగంగా సర్వే నౌకలు మెరైన్‌ ప్లాస్టిక్‌ లిట్టర్‌/అబాండన్డ్‌ లాస్ట్‌ లేదా డిస్కార్టెడ్‌ ఫిషింగ్‌ గేర్లు (ఎ.ఎల్‌.డి.ఎఫ్‌.జి.) పేరుతో అధ్యయనం నిర్వహించాయి. మరో మూడేళ్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సర్వేలో వెల్లడైన అంశాలను మత్స్యకారులు, బోటు ఆపరేటర్లకు తెలియజేసి వ్యర్థాలను సముద్ర జలాల్లో వేయవద్దని, తద్వారా జరుగుతున్న నష్టాలను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 370 నాటికల్‌ మైళ్ల దూరంలో నౌకలు సర్వే చేశాయి. రాబోవు కాలంలో దీన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

తెగిన వలలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రమాదకరం

చేపలవేట సమయంలో తెగిన వలలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర సామగ్రిని సముద్ర జలాల్లో మత్స్యకారులు పడేస్తున్నారు. వాటిల్లో చిక్కుకుని చిరు చేపలు, కారలు, పీతలు, రొయ్యలు, కటిల్‌ ఫిష్, తాబేళ్లు వంటివి చనిపోతున్నాయి. ఎఫ్‌ఎస్‌ఐ అంచనా ప్రకారం సముద్ర జలాల్లో వ్యర్థాల కారణంగా 3 నుంచి 5శాతం మేర మత్స్య దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఉపరితలంపై తేలియాడే పాలిథిన్‌ సంచులు, ప్లాస్టిక్‌ సీసాలు, తెగిపోయిన వలల ముక్కలు, ఉపకరణాలు తదితర అధిక సాంద్రతతో ఉండే వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో అధికం..

గోపాలపూర్, పెంటకోట, పూడిమడక, భీమునిపట్నం, చింతపల్లి సముద్ర తీర ప్రాంతాలు అధికంగా కలుషితమైనట్లు గుర్తించారు. బంగ్లాదేశ్‌ నుంచి ఒడిశా వైపు భారీగా వ్యర్థాలు కొట్టుకొస్తున్నట్లు నిర్ధారించారు. 

మత్స్యకారులకు అవగాహన 

శిబిరాలు: వ్యర్థాల కారణంగా సముద్ర జలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ డివిజన్‌ ఇన్‌ఛార్జి భామిరెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ, భీమిలి ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించారు. రాబోవు కాలంలో కోనసీమ, కాకినాడ, మచిలీపట్నం, బారువా, గోపాల్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని