logo

పోరాట స్ఫూర్తికి... నిలువెత్తు నిదర్శనం

భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించడానికి బ్రిటీష్‌ పాలకులపై విల్లు ఎక్కుపెట్టిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుడు పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామంలో 1897 జులై 4వ తేదీన అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు.

Published : 04 Jul 2024 02:20 IST

నేడు అల్లూరి జయంతి
పాండ్రంగి అభివృద్ధికి హామీలిచ్చి విస్మరించిన నేతలు

పద్మనాభం, న్యూస్‌టుడే: భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించడానికి బ్రిటీష్‌ పాలకులపై విల్లు ఎక్కుపెట్టిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుడు పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామంలో 1897 జులై 4వ తేదీన అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. తర్వాత తండ్రి స్వగ్రామం అయిన పశ్చిమగోదావరి జిల్లా మొగల్లులో బాల్యం, విద్యాభ్యాసం గడిచింది. ఆ పోరాట యోధుడి సేవలను గుర్తించిన తెదేపా ప్రభుత్వం 2014 నుంచి అల్లూరి జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది.


ల్లూరి జయంతిని పురస్కరించుకొని గతంలో ఇక్కడికొచ్చిన నాయకులెందరో హామీలిచ్చినప్పటికీ అవేవీ అమలుకు నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. పాండ్రంగి గ్రామాన్ని చారిత్రంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ప్రకటించినా అవన్నీ నీటి మీద రాతలుగానే మిగిలాయని, ఇక్కడ చేపట్టిన కోనేరు, ఆడిటోరియం పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


నేడు ప్రముఖుల రాక: పాండ్రంగి గ్రామంలో గురువారం నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను అధికారికంగా చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2వ తేదీన ఆదేశాలు జారీ చేయడంతో యంత్రాంగం అల్లూరి స్మారక పార్కు, జన్మగృహం, సభా ప్రాంగణం తదితర వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్సవాలకు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాసరావు, జ్ఞానవేణి, ఆర్డీవో భాస్కరరెడ్డి బుధవారం దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు, తెదేపా నాయకులు కె.దామోదరరావు, డి.గోపాలకృష్ణమూర్తిరాజు, రామరాజు  పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని