logo

మౌలిక వసతుల కల్పన, భూముల రక్షణకు.. అధిక ప్రాధాన్యం

విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ అన్నారు.

Published : 04 Jul 2024 02:18 IST

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా
జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ అన్నారు. బుధవారం ఉదయం 10.11గంటలకు కలెక్టరేట్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

  • ‘జిల్లాలో భూముల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రస్తుతం ఉన్న చట్టాలు, సీసీఎల్‌ఏ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులు తదితరాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళతాం. చట్టాలకు లోబడే చర్యలు ఉంటాయి. అర్హులకు అన్యాయం జరగదు. పలు జిల్లాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిపై అవగాహన పెంచుకొని ముందుకెళతా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎవరైనా ఎప్పుడైనా కలిసి సమస్యలను తెలియజేయవచ్చు. ప్రభుత్వ ప్రాధామ్యాలైన సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన విశాఖ సర్వతోముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. పర్యాటక పరంగా మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తాం’ అన్నారు.
  • ‘ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. అదేవిధంగా కీలకమైన పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాం. యువతకు ఉపాధి కల్పించే వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తాం. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓగా పనిచేసిన అనుభవం ఉన్నందున వైద్య ఆరోగ్య సేవలపై దృష్టి సారిస్తా. క్యాన్సర్‌ సేవలు మెరుగుపరిచేందుకు గతంలో రూ.25కోట్ల ప్రాజెక్టును మంజూరు చేశాం. కేజీహెచ్, విమ్స్‌ సహా అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తూ మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతామ’ని కలెక్టర్‌ వివరించారు. బుధవారం ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కలెక్టర్‌ విశాఖ చేరుకున్నారు. అనంతరం సింహాచలం వెళ్లి అప్పన్న స్వామిని దర్శించుకొన్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని