logo

చేయి చేయి కలిపే... గుర్తింపు సాధించే..!

జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్‌ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి.

Published : 04 Jul 2024 02:13 IST

తిరుమలనగర్‌ నివాసిత సంఘానికి ప్రత్యేక అవార్డులు 
న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం(తిరుమలనగర్‌)

జీవీఎంసీ పరిధిలో వందలాది కాలనీలు ఉన్నా... 87వ వార్డు తిరుమలనగర్‌ కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నివాసితులు ఐక్యంగా, పట్టుదలతో పని చేస్తూ.. కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అనేక అవార్డులు వచ్చాయి.

కూర్మన్నపాలెం సమీపంలో సుమారు 30 ఎకరాల్లో ఉన్న కాలనీలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక్కడి సమస్యలపై కాలనీవాసులు ఎంతో శ్రద్ధగా జీవీఎంసీ అధికారులకు విన్నవించి.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

కాలనీలో మొత్తం అయిదు పార్కులు ఉండగా, వాటిల్లో రెండింటిని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు తిరుమలనగర్‌ సంక్షేమ సంఘం సభ్యులు జీవీఎంసీతో చేతులు కలిపారు. పార్కులో పచ్చదనం పెంపు, చిన్నపిల్లలకు అవసరమైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచారు.

ప్రత్యేక అవగాహన ఇలా..: కాలనీలో పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్‌ నియంత్రణ, వస్త్ర, నార సంచుల వినియోగం, మొక్కల పెంపకం, సేంద్రీయ ఎరువు తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా ‘తిరుమలనగర్‌ ఆర్‌డబ్ల్యూఏ’ యూట్యూబ్‌ ఛానల్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. బీ ఏటా జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాల్లో కాలనీ సభ్యులు  పాల్గొంటూ అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. దేశవ్యాప్త స్వచ్ఛ పోటీల్లో జీవీఎంసీకి మంచి ర్యాంకులు రావడానికి కూడా ఇక్కడి కార్యక్రమాలు దోహదపడుతున్నాయి.


ఇంకుడు గుంతలు- పచ్చదనం

భూగర్భ జలాల పెంపుపై కాలనీ సంఘం దృష్టి సారించింది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంకల్పించింది. పార్కులు, ఇంటి అవరణలో, రహదారుల పక్కన సుమారు 166 ఇంకుడు గుంతలు తవ్వి జల సంరక్షణకు చర్యలు చేపట్టారు. దీంతో ఇటీవల 50- 60 అడుగుల లోతులోనే నీటి లభ్యత జరుగుతుందని సంఘం ప్రతినిధి ఎం.పరమానందం తెలిపారు.

కాలనీలో కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటి పెంచుతున్నారు. అలాగే సేంద్రీయ ఎరువు తయారీపైనా దృష్టి సారించారు. 


ఇవీ పురస్కారాలు..

  • ‘ఉత్తమ నివాసిత సంక్షేమ సంఘం(ఆర్‌డబ్ల్యూఏ)’ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందించింది.
  • దేశవ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఏ విభాగంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దిల్లీ, బెంగళూరుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాలుగు సార్లు ఉత్తమ ఆర్‌డబ్ల్యూఏ అవార్డులు వచ్చాయి.
  • జల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్‌ వాటర్‌ హీరో’ అవార్డు, విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ‘నీటి సంరక్షణ అవార్డు’ దక్కాయి. 
  • ఆనంద్‌ సిటిజెన్‌ అవార్డుతో పాటు, జిల్లా, జోనల్‌ స్థాయిలో 18 అవార్డులు సంఘానికి దక్కాయి.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని