logo

డ్వాక్రా రుణాలు గుటుక్కు

అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి.

Published : 04 Jul 2024 02:09 IST

బ్యాంకు సిబ్బంది, వీఏఓల కుమ్మక్కు

అనకాపల్లి పట్టణం, కొత్తూరు, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని వెలుగు కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న వీఓఏల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. సత్యనారాయణపురంలో వీఓఏగా పనిచేసిన మంగతాయారు, డ్వాక్రా సంఘ మహిళలను మోసం చేసి రుణాలు తీసుకుని ఇవి కట్టకుండా పరారైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతున్నా ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ తరహా మోసమే కొత్తూరు పంచాయతీ ఎన్జీవో కాలనీలో జరిగింది. ఈ కాలనీకి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలకు తెలియకుండానే వారి పేరుతో వీఓఏ  నసీమా రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇలా మూడు డ్వాక్రా సంఘాల్లోని 30 మంది గ్రూపు సభ్యుల పేరిట రూ. 52 లక్షల రుణాన్ని బ్యాంకు ఆఫ్‌ ఇండియా అనకాపల్లి బ్రాంచి నుంచి ఆమె తీసుకున్నారు. రుణాలు సక్రమంగా చెల్లించపోవడంతో ఇటీవల బ్యాంకు మేనేజర్‌ డ్వాక్రా సంఘాల మహిళలకు నోటీసులు పంపారు. తాము ఎలాంటి రుణం తీసుకోకుండా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ మహిళలు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. 

వెలుగు అధికారులకు బీఎం ఫిర్యాదు

డ్వాక్రా సంఘాల సభ్యులకు తెలియకుండా వారి పేర్లమీద బ్యాంకు రుణాలు తీసుకుని వీఓఏ నసీమా మోసగించారంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. తాను ఇద్దరి పేర్లమీద రుణం తీసుకున్నానని, ఇవి చెల్లించేస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం.  చాలామంది పేర్లమీద వారికి తెలియకుండా బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు తేలడంతో వెలుగు అధికారులకు బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదు చేశారు. 


అన్నీ అక్రమాలే

వెలుగు కార్యాలయంలో పరిధిలో పనిచేస్తున్న వీఓఏల్లో కొంత మంది బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో రుణాలు తీసుకుని వాటిని కట్టకుండా మోసం చేస్తున్నారు. బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 2022 జనవరి నుంచి 2023 మార్చి వరకు సుమారు రూ. 3.32 కోట్లు రుణాలను 22 గ్రూపులకు మంజారు చేశారు. వీటిలో చాలా వరకు ఆయా గ్రూపు సభ్యులకు తెలియకుండానే రుణాలు మంజూరుచేశారు. ఇవి సక్రమంగా కట్టకపోవడంతో బ్యాంకు మేనేజర్‌ మహిళలకు నోటీసులు ఇస్తున్నారు.  దీనిపై బ్యాంకు ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా 2022 జనవరి నుంచి 2023 మార్చి వరకు రూ. 3.32 కోట్ల రుణాలను 22 డ్వాక్రా సంఘాలకు అప్పట్లో పనిచేసిన మేనేజర్‌ రుణాలు మంజూరు చేశారన్నారు. చెల్లింపులు సరిగా లేకపోవడంతో నోటీసులు పంపాన్నారు. ఈ విషయంపై డీఆర్‌డీఏ అధికారులకు తాము ఫిర్యాదు చేశామన్నారు. రుణాల మంజూరులో జరిగిన అవకతవకలపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేస్తారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని