logo

అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..

ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్‌ఎస్‌ కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్‌ బాలు కిసాన్‌ మిత్రా హెల్ప్‌లైన్‌ ప్రారంభించారు.

Published : 04 Jul 2024 02:07 IST

ఈనాడు, పాడేరు

పెట్టుబడులు పెరిగిపోవడం.. దిగుబడులు తగ్గిపోవడం.. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోవడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులపాలై రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు.


ఇలాంటి రైతు కుటుంబాలకు ఆదుకునేందుకు రూరల్‌ డెవలెప్‌మెంట్ సర్వీస్‌ సొసైటీ (ఆర్‌డీఎస్‌ఎస్‌) అనే స్వచ్ఛంద సంస్థ తోడుగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట కేంద్రంగా సేవలందిస్తున్న ఈ సంస్థ కష్టాల్లో ఉన్న కర్షకుల కుటుంబాలకు జీవనోపాధిని చూపిస్తోంది. బాల బడులతో ఆదివాసీ బిడ్డలకు అక్షరాలను దగ్గర చేస్తోంది.

త్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్‌ఎస్‌ కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్‌ బాలు కిసాన్‌ మిత్రా హెల్ప్‌లైన్‌ ప్రారంభించారు. రైతులు తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా 94909 00800కు కాల్‌ చేస్తే వాటికి ఆర్‌డీఎస్‌ఎస్‌ తరఫున పరిష్కారం చూపుతున్నారు. పంట యాజమాన్య పద్ధతుల నుంచి పంట రుణాలు ఇప్పించడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా సాయపడుతున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారికి పాడి పశువులను అందించి జీవనోపాధికి దారి చూపిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న 26 రైతు కుటుంబాలకు పాడి ఆవులను అందించి రూ.2 వేల నుంచి 10 వేల వరకు ఆర్థిక సాయం చేశారు. రైతు స్వరాజ్య వేదిక పేరుతో కౌలు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి, నివేదికలను ప్రభుత్వాలకు అందిస్తున్నారు.


ఆదివాసీ పిల్లల కోసం బాలబడులు.. 

న్యం మారుమూల గ్రామాల్లో సర్కారీ బడుల్లేక పిల్లలు పలకా బలపానికి దూరమైతున్నారు. అలాంటి వారి కోసం 2014 నుంచి బాలబడులు ఏర్పాటు చేసి చిన్నారులకు ఆంగ్ల అక్షరాలను నేర్పిస్తున్నారు.

చింతపల్లి మండలం తరుబొంగులు, కోట్లగరు, జి.మాడుగల మండలం వలసపాడు, పెదపొర్లు, కొత్త ఎస్‌.పెదబయలు, బర్సింగిమెట్ట, మూగమర్రి, తోకరాయి వంటి గ్రామాల్లో ఆర్‌డీఎస్‌ఎస్‌ తరఫున బాలబడులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో కోందు భాష మాత్రమే మాట్లాడుతుంటారు.. వారి కోసం ఆ భాష తెలిసిన స్థానిక చదువుకున్న యువతను గుర్తించి వారికి బోధనపై శిక్షణ ఇచ్చి బోధకులుగా నియమిస్తున్నారు. ముందు కోందు భాషలో మొదలుపెట్టి తెలుగు, ఆంగ్ల పదాలు నేర్పించి చదువుపట్ల ఆసక్తిని పెంచుతున్నారు. మూడో తరగతి వరకు బాలబడిలో ఉంచి నాలుగో తరగతి నుంచి ఆ పిల్లాడిని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ పదేళ్లలో సుమారు 2 వేలమంది పైగా పిల్లలకు బాలబడుల ద్వారా విద్యాభ్యాసం చేయించారు. రైతులు, గిరిజన పిల్లలకు అందించే సేవలకు గుర్తింపుగా 2021లో గాంధీ సెంటర్‌ వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు కేఎస్‌ శాస్త్రి జ్ఞాపకార్థం శ్రీనుకు ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డుని అందించారు. అంతకు ముందు పలు సంస్థల నుంచి ప్రశంసా పత్రాలను అందుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని