logo

ఆ ఇళ్ల సంగతేంటి?

జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి.

Updated : 04 Jul 2024 04:27 IST

మార్గదర్శకాలకు ఎదురుచూపులు
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. 2453 నిర్మాణాలు ఇంతవరకూ మొదలేకాలేదు. కొత్త ప్రభుత్వంలో వీటిని నిర్మించుకోవడానికి అనుమతి వస్తుందా లేదా అన్నది స్పష్టత రావాల్సిఉంది. ఇళ్ల నిర్మాణ పనులకు ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షాలు మొదలైతే ఈ పనులు మందగిస్తాయి. చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థ అధికారులను కలిసి ఇళ్లు కట్టుకోవడం మొదలెడితే బిల్లులు ఇస్తారా... ఇవ్వరా అంటూ అడుగుతున్నారు. ఇప్పటికీ పునాదుల స్థాయిలోనే 9674 ఇళ్లున్నాయి. లింటల్‌ స్థాయిలో 608, గుమ్మాల ఎత్తులో 2823 గృహాలు ఉన్నాయి. జిల్లాకు 56,580 గృహాలు మంజూరు కాగా, 25,535 మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే రూ. 1.8 లక్షలు ఏ మాత్రం సరిపోకపోవడంతో వీటిని పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణ సామగ్రి ధరలు భారంగా మారడంతో చాలాచోట్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కనీసం ఐదారు లక్షల రూపాయలు చేతిలో ఉంటేగాని ఇల్లు పూర్తి చేసుకోలేని పరిస్థితి ఉంది. కొంతమంది గుత్తేదారులకు మొత్తంగా ఐదారు లక్షల రూపాయలు ఇచ్చి కట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నవి తప్ప ఊరికి దూరంగా ఉన్న అనేక కాలనీల్లో అసంపూర్తి ఇళ్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల లే-అవుట్లలో వేళ్లమీద లెక్కించదగ్గ సంఖ్యలో మాత్రమే నిర్మాణాలున్నాయి. చెట్టుపల్లి రెండో లే-అవుట్‌లో ఒక్క ఇల్లూ మొదలు కాలేదు. జగనన్న కాలనీల్లో చాలాచోట్ల అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ చాలాచోట్ల ఇప్పటికీ సమకూరలేదు. ఎక్కువ ఇళ్లున్న చోట ప్రాథమిక పాఠశాల, శ్మశాన వాటికలు వంటివి ఏర్పాటు కావాల్సి ఉంది.


త్వరలో పరిష్కారం 

- వై.శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి   

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. వీటి కోసం అందరం ఎదురు చూస్తున్నాం. త్వరలో ఆదేశాలొస్తాయని భావిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని