logo

అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు

మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన.

Published : 04 Jul 2024 02:03 IST

నేడు విప్లవవీరుడి జయంతి వేడుకలు
అధికారికంగా నిర్వహణకు భారీ ఏర్పాట్లు
న్యూస్‌టుడే, కృష్ణదేవిపేట, కొయ్యూరు

మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. అల్లూరితోపాటు ఆయన అనుచరుడు గంటందొరను కృష్ణదేవిపేటలో సమాధి చేశారు. ఇక్కడ అల్లూరి పేరిట నందనవనాన్ని గతంలో అయ్యన్నపాత్రుడు హయాంలో అభివృద్ధి చేశారు.

కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సీతారామరాజు 127వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. కృష్ణదేవిపేటలో జరిగే వేడుకలకు శాసన సభాపతి అయ్యన్న ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందుకోసం నందనవనంలో పాడుబడ్డ షెల్టర్లు తొలగించారు. గోడలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. అయ్యన్న ఆదేశాల మేరకు నర్సీపట్నం ఆర్‌డీఓ జయరాం రెండు రోజులుగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక కూటమి నాయకులు చిటికెల తారకవేణుగోపాల్‌తోపాటు జనసేన, భాజపా నాయకులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తోపాటు కేంద్ర పర్యటకశాఖ మంత్రి  వచ్చే అవకాశం ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు. 


ల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో విప్లవ వీరుడి జీవిత చరిత్రకు సంబంధించి నందనవనంలో చిత్ర కళాప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయంలో సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంపీ సీఎం రమేశ్, అయ్యన్నపాత్రుడు పోలీసు ఉన్నతాధికారులు ఆవిష్కరించనున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో గ్రామీణ సీఐ హరి, పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


వైకాపా హయాంలో తీరని నిర్లక్ష్యం..: వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదు. ఆయన పోరాటానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలను పక్కనపెట్టేసింది. సరికదా.. అంతకుముందు తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు కనీసం మరమ్మతులు చేసేందుకూ అణాపైసా మంజూరు చేయలేదు. పోరాట యోధుడి జ్ఞాపకాలు శిథిలావస్థలో ఉన్నా.. అప్పటి పాలకులు కనీసం కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అల్లూరి స్మారకాల అభివృద్ధిపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.


నెరవేరని హామీలు : కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం స్మారక ఉద్యానాల అభివృద్ధికి గతంలో అప్పటి రాజ్యసభ సభ్యుడు సురేష్‌ప్రభు రూ. 50 లక్షల చొప్పున కేటాయించారు. మంప చెరువులో పూడిక తీసి చుట్టూ గట్టు ఏర్పాటు చేశారు. సమావేశాలు జరుపుకోవడానికి స్టేజీ, ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. రాజేంద్రపాలెంలో ఆ నిధులు ప్రహరీ నిర్మించడానికే సరిపోయాయి. ఆ తర్వాత మంపలో 2022 మే 7న అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యానాల్లో ఉపాధి హామీ పథకం కింద సిమెంట్‌ రోడ్లు, పూల మొక్కలు, కూర్చొనేందుకు బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆదిశగా తీసుకున్న చర్యలు శూన్యం. సీతారామరాజు తన అనుచరులతో కలిసి పోరాటాల సమావేశాలకు స్థావరంగా ఏర్పాటు చేసుకున్న మంప సమీపంలోని ఉర్లకొండ గుహ అభివృద్ధి జాడేలేదు. మంపలోని ఉద్యానాన్ని క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. రాజేంద్రపాలెం ఉద్యానం కళాహీనంగా దర్శనమిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని