logo

ఇసుక నిల్వలపై అక్రమార్కుల కన్ను

నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది.

Published : 04 Jul 2024 02:02 IST

'నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డులోని భారీ నిల్వలపై అక్రమార్కుల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలో నక్కపల్లిలో యార్డు ఏర్పాటు చేసి నిర్దేశిత ధరలకు ఓ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు చేయించింది. దీంతో ట్రాక్టరు లోడు రూ. 7 వేలకుపైమాటే పలికింది. ఇది పేద, మధ్య తరగతి వర్గీయులకు చాలా భారంగా మారింది. దీంతో ఇళ్ల నిర్మాణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. గతనెల 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వ జయకేతనం ఎగురవేసిన వెంటనే యార్డుల్లో విక్రయాలు నిలిపేసింది. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది.

ఎన్నికల ఫలితాల సందడి, ఇతరత్రా హడావుడిలో నేతలు, అధికారులు నిమగ్నమై ఉంటే కొందరు స్వార్థపరులు యార్డుల్లో ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తరలించేశారు. పదుల సంఖ్యలో వాహనాల్లో దారి మళ్లించారు. దీంతో ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం డిపో చుట్టూ యంత్రాలతో కందకాలు తవ్వించింది. రాత్రుళ్లు కాపలాదారులు లేకపోవడంతో ఇప్పటికీ రక్షణ కరవైంది. ప్రస్తుతం నక్కపల్లి యార్డులో సుమారు 30 వేల టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఇసుక నూతన పాలసీ ఈనెల 8 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉచితంగా అందరికీ ఇసుక అందుబాటులోకి తెస్తామని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ఇలాంటి సమయంలో నక్కపల్లి యార్డు వద్ద మంగళవారం గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలించే యత్నంపై కొంత అలజడి రేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రుళ్లు గట్టి నిఘా ఉంటే తప్ప, ఈ నిల్వలను కాపాడలేరు. దీనిపై తహసీల్దారు శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఇసుక నిల్వలున్న ప్రాంతంలో తమ సిబ్బందిని ఏర్పాటు చేశామని, అదేవిధంగా మైనింగ్‌ అధికారులతో మాట్లాడితే వారూ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని