logo

తప్పుల తడకగా ధ్రువపత్రాలు..!

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 04 Jul 2024 01:56 IST

సరైన ఆధారాలు లేకుండా ఆన్‌లైన్లో నమోదు ఫలితం

ఎంవీపీకాలనీ, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేయించిన కులగణన తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం ఆ సమాచారంతోనే ధ్రువపత్రాలు జారీచేయాలంటూ వచ్చిన ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నాడు జరిగిన కులగణన లోపభూయిష్టంగా ఉందని.. సరిచేసిన తర్వాత జారీచేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కులగణన పేరిట వాలంటీర్లను ఇంటింటికి పంపించి నివాసితుల కులం, ఇతర సమాచారాన్ని సేకరించగా.. అనేక మంది తప్పుడు వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వారు చెప్పిన సమాచారాన్ని పూర్తిగా ధ్రువీకరించుకోకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. తరువాత ఎన్నికలు రావటంతో సమాచార సేకరణ, ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది.

  • కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయా కుల ధ్రువపత్రాలు గ్రామ సచివాలయ సిబ్బంది లాగిన్‌లోకి వచ్చి ఉన్నాయి. వీటిలో అనేక   పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయి. అయితే కుల ధ్రువపత్రాలు అడుగుతున్న వారికి నాడు సేకరించిన సమాచారం ఆధారంగానే జారీచేయాలంటూ ఇటీవల కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించగా.. చాలా వరకు చిరునామాలు, పూర్తి వివరాలు లేకుండా ఉన్నాయి. ప్రస్తుతం వీటిని జారీ చేయాలంటూ ఆదేశాలు రావటంతో కనీసం పరిశీలన లేకుండా ఎలా జారీచేస్తామంటూ సచివాలయ రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్కు చెందిన అధికారులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వెంటనే జారీ చేయాలన్నారు. దీంతో రెవెన్యూ సిబ్బంది తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు ఎందుకంత తొందర పడుతున్నారో అర్థం కాక అయోమయంలో ఉన్నారు.
  • ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. పరిశీలన చేసిన తర్వాతే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులను కోరారు. తప్పుడు కుల ధ్రువపత్రం జారీ చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని వివరించారు. దీనిపై స్పందించిన అధికారులు పరిశీలించిన తర్వాతే జారీ చేసేలా ఆదేశాలు ఇస్తామన్నారు. ఆచరణలో ఎంత వరకు చేస్తారో చూడాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని