logo

భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణాలపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు?

విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న తమ ఆదేశాలకు ఎందుకు కట్టుబడలేదని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులను హైకోర్టు నిలదీసింది.

Published : 04 Jul 2024 01:55 IST

జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్లు, విశాఖ కలెక్టర్‌ను నిలదీసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న తమ ఆదేశాలకు ఎందుకు కట్టుబడలేదని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులను హైకోర్టు నిలదీసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కనీసం మౌఖికంగానైనా కోర్టుకు వెల్లడించకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఇదే చివరి అవకాశమని, తదుపరి విచారణనాటికి నివేదిక ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్, విశాఖ కలెక్టర్, భీమిలి తహసీల్దార్‌ను ఆదేశించింది. అధికారులను చూసి భయపడాల్సిన అవసరం లేదని జీవీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ కె.మాధవరెడ్డికి సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తిన్నెలను తొలగించి భీమునిపట్నం మూడో వార్డు (జీవీఎంసీ పరిధి) వివిధ సర్వేనంబర్లలో సముద్ర తీరానికి సమీపంలో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారించిన ధర్మాసనం.. తక్షణమే అక్కడికి వెళ్లి పనులను అడ్డుకోవాలని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని