logo

చంద్రబాబు ఆన.. నెరవేరిన క్షణాన!!

పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

Published : 02 Jul 2024 03:30 IST

హామీ మేరకు పెంచిన పింఛను అందజేత
పంపిణీలో ‘కూటమి’ ప్రభుత్వం రికార్డు..!
వన్‌టౌన్, జ్ఞానాపురం, న్యూస్‌టుడే

చంద్రబాబు మాట ఇస్తే...
అమలు చేస్తారంతే! అనేది మరోసారి రుజువయింది!

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు పెంచిన మేరకు పింఛను సొమ్ములు అందజేశారు!

సోమవారం ఉదయం నుంచే అభాగ్యుల చెంతకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులు వారి చేతుల్లో నగదు ఉంచగా...
పేదల కళ్లల్లో మాటలకందని ఆనందం కనిపించింది!!

వర్షం పడినా... సర్వర్‌ ఇబ్బందులు ఎదురైనా రికార్డు స్థాయిలో తొలిరోజు పింఛన్ల పంపిణీ జరిగింది. 

పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెంచిన పింఛను మొత్తంతో పాటు బకాయిలు కలిపి అందజేశారు. తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ చురుగ్గా పాల్గొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ కలెక్టరేట్‌ సమీపంలోని దండుబజార్‌ సచివాలయ పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్, జోనల్‌ కమిషనర్లు, డీఆర్‌డీఏ అధికారులు, ఇతర జిల్లా అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. పలు చోట్ల సర్వర్‌ మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. లేకపోతే తొలిరోజే శతశాతం పంపిణీ పూర్తయి ఉండేదని కూటమి నేతలు చెబుతున్నారు.


సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు జిల్లాలో 95.12 శాతం మందికి పింఛన్లు అందజేశారు. ఇంకా ఐదు శాతం మందే మిగిలారు. వీరికి మంగళవారం ఉదయం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 1,64,150 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో  1,56,147 మందికి రూ.106.78 కోట్ల నిధులను అందజేశారు. గత వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేది. అప్పట్లో మూడు నాలుగురోజులు పట్టేది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఒక్క రోజులోనే 95శాతానికిపైగా పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షించారు. 


జీవితాల్లో వెలుగులు తెచ్చారు..

 - ఆకుల కమల, సెబాస్టియన్‌కాలనీ

ముఖ్యమంత్రి చంద్రబాబు మా జీవితాల్లో వెలుగులు తెచ్చారు. పింఛను రూ.4000లకు పెంచడంతో మా జీవనం మెరుగుపడుతుంది. రోజువారీ అవసరాలకు పెరిగిన పింఛను ఉపయోగపడుతుంది. బకాయిల సహా ఒకేసారి రూ.7000లు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం 7 గంటలకే నాకు పింఛను ఇచ్చారు.


ఇదంతా కలలా ఉంది..

- పి.మంగ, వడిచర్ల వీధి 

సచివాలయ కార్యదర్శులు ఉదయం 7గంటలకే ఇంటికి వచ్చి పింఛను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గత రెండు నెలలుగా పింఛను తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాం. ఏప్రిల్, మే, జూన్‌ నెలల బకాయిలు రూ.3వేలు, జులై నెల పింఛను రూ.4000 మొత్తం రూ.7వేలు అందుకోవడం ఒక కలలా అనిపించింది.  


మానసిక ధైర్యం కల్పించారు

- ఎస్‌.సంజీవనిరావు, హోలీక్రాస్‌ స్ట్రీట్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు పింఛనును ఒక్కసారిగా రూ.3000 నుంచి రూ.6000 పెంచి మానసిక ధైర్యం కల్పించారు. గతంలో పెరిగిన ధరలతో పింఛను సరిపోక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు  ఆ ఇబ్బందులు ఉండవు. మాకు కూటమి ప్రభుత్వం ఒక భరోసా కల్పించింది.


చంద్రబాబుకు రుణపడి ఉంటాం

- ఎస్‌.అన్నమ్మ, సాలివీధి

ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా కుటుంబ సభ్యులకు వృద్ధులు భారంగా మారుతున్నారు. పింఛను పెంచడంతో కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. చంద్రబాబుకు రుణపడి ఉంటాం.


వైకాపా పాలన ఫలితం ఇలా...

 -ఈనాడు, విశాఖపట్నం 

రాష్ట్రమంతా పెంచిన పింఛను సొమ్ము చేతికంది లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ అదృష్టం తనకు లేదని ఈ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేటకు చెందిన ఎం. సత్యవతికి ఇద్దరు కొడుకులు. ఒకరు సైకిల్‌ మెకానిక్, మరొకరు ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. భర్త మరణించిన తర్వాత పెద్ద కొడుకు వద్ద ఉంటోంది. దీంతో రేషనుకార్డులో పేరు నమోదయింది. అయితే...అప్పటి వరకూ అందుతున్న పింఛనును గత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆపేశారు. అధికారుల చుట్టూ తిరగ్గా ‘నీ మనవడికి ఉద్యోగం ఉంది. అందుకనే పింఛను నిలిపేశాం’ అని సమాధానమిచ్చారు. తరువాత నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా పింఛను పునరుద్ధరించలేదు. తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నడవలేని స్థితిలో ఉన్న సత్యవతిని తీసుకొని కొడుకులిద్దరు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి వినతి పత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని