logo

వాళ్లు ఏడిపించారు..వీళ్లు ఏడువేలిచ్చారు!

కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు.

Updated : 02 Jul 2024 04:41 IST

కూటమి సర్కారుకు అవ్వాతాతల కృతజ్ఞతలు
-ఈనాడు, అనకాపల్లి, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. సచివాలయ సిబ్బంది.. కూటమి నేతలు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ములు చేతికి అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి నెలలోనే పెంచిన పింఛను సొమ్మును బకాయిలతో కలిపి ఇవ్వడంతో అవ్వాతాతల మోములో ఏడింతల ఆనందం కనిపించింది. అనకాపల్లి, అల్లూరి జిల్లాలో 3.91 లక్షల లబ్ధిదారులకు ఈ నెలలో రూ.262 కోట్లు పింఛను సొమ్మును పంచిపెడుతున్నారు. గత నెల కంటే రూ.156 కోట్లు అదనంగా ఈ నెల ఖర్చుచేస్తున్నారు.

అనకాపల్లిలో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బందితో కలిసి పించన్‌దారుల ఇంటికి వెళ్లి వారికి నగదు అందజేశారు. దీనిపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

ఆడంబరానికి దూరంగా.. అందరికీ అందేలా..

వైకాపా సర్కారు రూ.250 పెంచినప్పుడల్లా హడావిడి చేసేవారు. వారం రోజుల పాటు సభలు, సమావేశాలుపెట్టి లబ్ధిదారులను తరలించి జగన్‌ భజన చేయించేవారు. కూటమి సర్కారు మాత్రం రూ. వెయ్యి ఒకేసారి పెంచినా ఆడంబరానికి పోలేదు. స్థానిక నేతలే ఇంటింటికి వెళ్లి పింఛను సొమ్ము ఇచ్చి చంద్రబాబు లేఖను అందించారు. ఎన్నికల కోడ్‌ సమయంలో వైకాపా నేతల చర్యల వల్ల అవ్వాతాతలు పడరాని పాట్లు పడ్డారు. ఈ నెల నుంచి ఇంటికే అందజేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో ఒకేరోజు అందరికీ అందేలా చేయడంలో సఫలమయ్యారు. 


తొలిరోజు 94.1 శాతం పైగా పింఛన్ల పంపిణీ 

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ విజయవంతంగా చేపట్టామని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. అనకాపల్లి ఉడ్‌పేట సచివాలయం పరిధిలో పింఛను సొమ్ము అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,64,033 పింఛనుదారులకు రూ.174 కోట్లు మేర పంపిణీ చేపట్టామన్నారు. సబ్బవరం మండలం గొటివాడ సచివాలయం బొండవానిపాలెంలో 409 పింఛన్లకు తొలిరోజు 376 పంపిణీ చేశామన్నారు. తొలిరోజు 94.1 శాతం పైగా పంపిణీ చేశామన్నారు.  డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, డీఎల్‌డీవో మంజులవాణి, ఏపీడీ డైజీ, పెన్షన్‌ డీపీఎం వెంకటరమణ పాల్గొన్నారు.


మాట నిలుపుకొన్న బాబు..

కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పింఛన్ల పంపిణీ ఊరూరా.. ఇంటింటా పండగలా నిర్వహించారు. రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.4 వేలకు పెంచి ఇవ్వడంతో పాటు గత మూడు నెలల బకాయిలు కలిపి రూ. 7 వేల చొప్పున అందించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ఆనందం పంచుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మా బాబు బంగారం అంటూ కొనియాడారు.  


చంద్రబాబు.. పేదల దేవుడయ్యారు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఇద్దరు పిల్లలు. భర్త గొర్లె పైడంనాయుడుతో కలిసి ఉన్న కొద్ది పొలంలో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఐదేళ్ల కిందట పొలంలో పనిచేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. నోటి మాట రాలేదు. కాలు, చేయి చలనం లేకుండా పోయాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. పక్షవాతం వల్ల మంచానికే పరిమితమయ్యారు. నాటి నుంచి ఒక్కదాన్నే పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. కూటమి ప్రభుత్వం నా భర్తకు పింఛనుగా రూ.15 వేలు మంజూరు చేసి ఉదయాన్నే సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాలాంటి ఎందరో పేదల పాలిట దేవుడయ్యారు. మా కటుంబానికి భరోసా ఇవ్వడం ఆనందంగా ఉంది.

గొర్లె రమణమ్మ, దేవరాపల్లి


రెండు నెలలు బ్యాంకుల చుట్టూ తిరిగాం

- పెంటకోట వరలక్ష్మి, అనకాపల్లి

పింఛన్‌ నగదు కోసం రెండు నెలల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగాం. ఎండల్లో నిరీక్షించాల్సి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికే పెంచిన పింఛన్‌ నగదు పంపుతానని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రూ. 7 వేలు ఉదయం ఆరుగంటలకల్లా అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని ఎన్నటికీ మరచిపోలేం.


అన్ని అవసరాలు తీరుతాయి

- జె.తేజ, దివ్యాంగుడు నర్సీపట్నం

అందరి దివ్యాంగులతోపాటు నాకు పెంచిన రూ.6 వేలు అందజేశారు. గతంలో ఇచ్చే డబ్బులతో మందులు కొనుక్కోలేకపోయేవాళ్లం. ఇప్పుడు ఈ సొమ్ముతో అన్ని అవసరాలు తీరుతాయి. ఇదివరకు మాలాంటి వారంతా ఏ విషయానికైనా చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఇక మాకు ఏ సమస్యలు ఉండవని భావిస్తున్నాం. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం మాకు డబ్బులు పెంచి మాట నిలుబెట్టుకున్నారు. భవిష్యత్తులో మాకు అన్నివిధాలా అండగా ఉంటారన్న నమ్మకం ఏర్పడింది.


పెరుగుతున్న ధరలకు అనుగుణంగా..

- వేగి ధనలక్ష్మి, అనకాపల్లి 

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్‌ నగదు ఒకేసారి పెంచి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఒకేసారి రూ.1000 పెంచి నెలకు రూ. 4 వేలు ఇవ్వడం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌ నగదు సచివాలయం సిబ్బందితో ఇంటికి తీసుకొచ్చి అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని