logo

జీవీఎంసీలో పరాయి అధికారుల పాగా..!

గత వైకాపా ప్రభుత్వ పాలనలో మహా విశాఖ నగరపాలక సంస్థను పరాయి శాఖల అధికారులతో నింపేశారు. కీలకమైన పోస్టుల్లో మున్సిపల్‌శాఖకు సంబంధంలేని అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

Published : 02 Jul 2024 03:02 IST

డిప్యుటేషన్‌పై వచ్చి పాతుకు పోయిన వైనం 
వైకాపా పెద్దల అండతో ఇష్టారాజ్యం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ పాలనలో మహా విశాఖ నగరపాలక సంస్థను పరాయి శాఖల అధికారులతో నింపేశారు. కీలకమైన పోస్టుల్లో మున్సిపల్‌శాఖకు సంబంధంలేని అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తమకు అనుకూలమైన రీతిలో నిర్ణయాలు వారి చేత అమలు చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నం వికటించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తెదేపా, జనసేన నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే కొనసాగేలా పైరవీలు ప్రారంభించారు.


డీపీఓగా వచ్చి... జోనల్‌ కమిషనర్‌గా మారి: జోన్‌-3 జెడ్సీ విజయలక్ష్మి కలెక్టరేట్‌ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారిణి. గత ప్రభుత్వ హయాంలో యూసీడీ డీపీఓ (ఉప పథక అధికారి)గా డిప్యుటేషన్‌పై వచ్చారు. అనంతరం వైకాపా పెద్దల అనుగ్రహంతో తక్కువ కాలంలోనే నగరంలో కీలకమైన జోన్‌-3 జోనల్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. బీ ఇలా ఇతర శాఖలకు చెందిన అధికారులను జీవీఎంసీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చిన గత వైకాపా ప్రభుత్వం మున్సిపల్‌ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారిని వెంటనే మాతృ సంస్థలకు పంపించి, ఆ స్థానంలో అర్హులైన మున్సిపల్‌శాఖ అధికారులను నియమించాలని జీవీఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు.


అదనపు కమిషనర్‌గా జైళ్లశాఖ అధికారి : జైళ్లశాఖ అధికారిగా ఉన్న వి.సన్యాసిరావును వైకాపా ప్రభుత్వం డిప్యుటేషన్‌పై మహా విశాఖ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ (ఏడీసీ)గా నియమించింది. మధ్యలో 8నెలలు ఆయన గవర్నర్‌ వద్ద విధులు నిర్వహించారు. తర్వాత ఓ మాజీ మంత్రి ఆశీస్సులతో తిరిగి జీవీఎంసీకి వచ్చారు. ఏడీసీగా ఉన్న ఆయనకు రెవెన్యూ, ప్రజారోగ్యం వంటి కీలక శాఖలను అప్పగించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఆయన మాతృ సంస్థకు వెళతారనే ప్రచారం జరుగుతోంది.


సహకారశాఖ నుంచి జోన్‌-6 జెడ్సీగా: సహకార శాఖలో విధులు నిర్వహించిన సన్యాసి నాయుడికి మహా విశాఖ నగరపాలక సంస్థ జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. వైకాపా ప్రభుత్వంలో ఆయన రెండు సార్లు బదిలీ అయ్యారు. పైస్థాయిలో తనకున్న పరిచయాలతో అతి తక్కువ సమయంలో తిరిగి జీవీఎంసీకి రావడం విశేషం. ఆయన సర్వీసులో అధిక సమయం జీవీఎంసీలోనే విధులు నిర్వహించారు. ఇటీవల ఆయన డిప్యుటేషన్‌పై ఇక్కడికి రాగా కీలకమైన గాజువాక(జోన్‌-6) జడ్సీగా బాధ్యతలు అప్పగించారు.


ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌కు యూసీడీ పీడీ బాధ్యతలు: ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించే పాపునాయుడిను గత వైకాపా ప్రభుత్వం జీవీఎంసీ యూసీడీ పీడీగా నియమించింది. మహిళా సంఘాల నిర్వహణ, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం, లబ్ధిదారులకు టిడ్కో గృహాలు కేటాయించడం, మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడం వంటి విధులు నిర్వహించే పోస్టులో ఆయన్ను నియమించడంపై అప్పట్లో జీవీఎంసీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకు గాను పాపునాయుడు అడుగడుగునా తన స్వామి భక్తిని ప్రదర్శించారు. ఎన్నికల్లో వైకాపా నాయకులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. లబ్ధిదారులకు కాకుండా వైకాపా నాయకులు చెప్పిన వారికి టిడ్కో గృహాలు కేటాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సెలవుపై వెళ్లడంతో ఇన్‌ఛార్జిగా ఎంవీడీ ఫణిరాంను నియమించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని